రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. మద్యాన్ని వైన్స్ ల ద్వారా చట్టబద్ధంగా ప్రభుత్వమే అమ్ముతుంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నియంత్రణలో నడుస్తాయి. మరోవైపు బెల్ట్ షాపులు అనధికారిక మద్యం కేంద్రాలుగా గ్రామాల్లో వెలిశాయి. వీటితో పల్లెల్లో మద్యం ఏరులై పారుతుంది. ఇప్పుడు మందు దొరకని పల్లెలు అంటూ లేవు. నిబంధనలకు విరుద్ధంగా వెలసిన బెల్టు షాపులు ప్రజల్ని మద్యానికి బానిసను చేస్తున్నాయి. ఇందులో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. గ్రామాల్లో 24 గంటల పాటు బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. వీటితో తాగుబోతులకు అదుపు లేకుండా పోతుంది. రోజంతా చేసిన కష్టం మందుకు పెడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడంతో కుటుంబాలు వీధిపాలవుతున్నాయి. కల్తీ మద్యం దందా కూడా బెల్ట్ షాపుల ద్వారా జోరుగా సాగుతుంది. మరోవైపు యువత తాగుడికి బానిసై అనేక నేరాలకు పాల్పడి శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు.
మహిళా సంఘాలు, సామాజిక సేవా సంస్థలు బెల్ట్ షాపుల మూసివేతకు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బెల్ట్ షాపులు మూసివేస్తామని హామీ ఇచ్చింది. తాజాగా బెల్ట్ షాపుల మూసివేతకు రంగం సిద్ధం చేస్తోంది. దీని కనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. దీంతో వారు క్షేత్రస్థాయి కసరత్తు మొదలుపెట్టారని సమాచారం. ప్రభుత్వం అధికారికంగా చేపట్టబోయే ఈ చర్యను పలు గ్రామాలు స్వాగతిస్తున్నాయి.
సామాజిక సమస్యలు
విచ్చలవిడి మద్యపాన అమ్మకాలతో తలెత్తుతున్న అనారోగ్య సమస్యలు ప్రజారోగ్య వ్యవస్థకు సవాలుగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు, గృహహింస, మానభంగాలు, కొట్లాటలు, హత్యలు ఆత్మహత్యలు పెరగడానికి మద్యపానం కారణమవుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,620 వైన్స్‌లు ఉండగా, వైన్‌షాపులతో పాటు గ్రామాల్లో లక్షకుపైగా అనధికారిక బెల్టుషాపులు ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో గ్రామంలో కనీసం 2 నుంచి 10కి పైగా బెల్టు షాపులున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ఆదాయానికి అండగా నిలిచే ప్రధాన శాఖల్లో ఎక్సైజ్ శాఖ ఒకటి. మద్యం నియంత్రణలో ఈ శాఖ పాత్ర కీలకం. ఈ శాఖ ద్వారా వచ్చిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణకు కీలకం కూడా. లిక్కర్ అమ్మకాలు పెరగాలని గత ప్రభుత్వం ఈ శాఖ అధికారులపైన ఒత్తిళ్లు పెంచిందని సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు బెల్ట్ షాప్ లపైన ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తోంది. గ్రామాల్లో బెల్టుషాపులను తొలగిస్తే ప్రభుత్వానికి ఏటా రూ.16 వేల కోట్ల ఆదాయం తగ్గుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా బెల్ట్ షాపుల మూసివేతకు శ్రీకారం చుట్టడం అభినందనీయం.
మద్య నిషేధంలో ఆ గ్రామం ఆదర్శం
గతంలో కొన్ని గ్రామాల్లో గ్రామ సర్పంచ్ పాటు, గ్రామ పెద్దల సహకారంతో మద్యపాన నిషేధంకై తీర్మానించారు. కానీ ఇది ఎక్కడా ఆచరణకు నోచుకోవడం లేదు. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. సర్పంచులపై అధికారులు, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, బెదిరింపులు రావడంతో తీర్మానం చెత్త బుట్టలో పడేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయిన్ పల్లి మండలం, స్తంభంపెల్లి గ్రామం మాత్రం 2019 లోనే సంపూర్ణ మద్యపాన నిషేధంలో విజయవంతమైనది. దీని వెనుక ఆ గ్రామ సర్పంచి అక్కెనపల్లి జ్యోతి కరుణాకర్ కృషి ఎంతో ఉన్నది. గ్రామంలోని యువత మద్యపాన వ్యసనంతో పక్కదారి పట్టడం జరుగుతోంది. ముఖ్యంగా చదువు మానేయడం, రోడ్డు ప్రమాదాలకు గురికావడం, గొడవలకు దిగి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మగవారు మద్యానికి బానిసై భూముల పట్టాలు, భార్యల బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. మరోవైపు తాగి భార్యలను కొడుతున్నారు. మద్యంతో ఎదురయ్యే ఇలాంటి సాంఘిక సమస్యలు గమనించిన ఆ గ్రామ సర్పంచి గ్రామస్తుల సహకారంతో మద్యపానం నిషేధించారు. మూడేళ్ల క్రితమే స్తంభంపల్లి గ్రామం మద్యం నిషేధంలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో గ్రామాల్లో బెల్టు షాపులు మూసివేస్తామని చెప్పడంతో ఆ గ్రామం మరొకసారి వెలుగులోకి వచ్చింది. ఆ గ్రామం నుంచే బెల్ట్ షాపులు నిషేధ ఉద్యమం ప్రారంభం కావాలి. ఈ గ్రామానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించాలి.
రాజగోపాల్ రెడ్డి అభినందనీయుడు
ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గ గ్రామంలో బెల్ట్ షాపులు నిషేధిస్తూ తీర్మానించిన గ్రామాలకు 5 లక్షల ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు తెలపడం అభినందనీయం. ఇలాంటి ప్రోత్సాహంతో మద్యపాన నిషేధానికి మరిన్ని గ్రామాలు ముందుకు వస్తాయి. అంతేకాకుండా ప్రభుత్వమే ప్రజల భాగస్వామ్యంతో మద్యాన్ని నియంత్రించే ప్రయత్నం చేయాలి. దీనికై మద్యం అనర్ధాలను ప్రజలకు వివరించాలి. అప్పుడు గ్రామాలే బెల్టు షాపులను తిరస్కరిస్తాయి. తద్వారా పల్లెల్లో ప్రశాంత వాతావరణం ఏర్పడనుంది.
- సంపతి రమేష్ మహారాజ్,సోషల్ ఎనలిస్ట్