MS Dhoni: ధోనీ 10 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయలేడు.. అందుకే 9వ స్థానంలో బ్యాటింగ్: ఫ్లెమింగ్

MS Dhoni: ధోనీ 10 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయలేడు.. అందుకే 9వ స్థానంలో బ్యాటింగ్: ఫ్లెమింగ్

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ఒకప్పటిలా అభిమానులను అలరించలేకపోతున్నాడు. చివరి వరకు క్రీజ్ లో ఉన్నప్పటికీ జట్టును గెలిపించలేకపోతున్నాడు. గతంలో ధోనీ చివరి వరకు క్రీజ్ లో ఉంటే విజయం ఖాయం. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. మహేంద్రుడు మునుపటిలా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. డెత్ ఓవర్స్ లో డాట్ బాల్స్ ఆడడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దానికి తోడు ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ లో ఎందుకు లోయర్ ఆర్డర్ లో వస్తున్నాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కెప్టెన్ కూల్ పై చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీపెన్ ఫ్లెమింగ్ క్లారిటీ ఇచ్చాడు. 

ఆదివారం (మార్చి 30) గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ తరపున చెన్నై సూపర్ కింగ్స్ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత ధోనీ గురించి హెడ్ కోచ్ ఫ్లెమింగ్ మాట్లాడాడు. ధోనీ ఎందుకు బ్యాటింగ్ ఆర్డర్ లో 9వ స్థానంలో వచ్చాడనే దానిపై వివరణ ఇచ్చాడు. " ధోనీ 10 ఓవర్ల పాటు ఫుల్ స్టిక్ తో బ్యాటింగ్ చేయలేడు. మోకాలి గాయం అతన్ని ఇబ్బంది పెడుతుంది. ధోనీ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. ఒకప్పటిలా అతని మోకాలు సహకరించడం లేదు. మ్యాచ్ పరిస్థితులను బట్టి అతను బ్యాటింగ్ కు వస్తాడు. జట్టు స్థితిని అంచనా వేసి తన బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చుకుంటాడు". అని ఫ్లెమింగ్ అన్నాడు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్ కు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ధోనీ కొంచెం ముందుగా బ్యాటింగ్ ఆర్డర్ లో వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్ లో అశ్విన్ కంటే వెనక బ్యాటింగ్ వచ్చిన ధోనీ 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వ స్థానంలోనే బ్యాటింగ్ కు వచ్చాడు. 25 బంతుల్లో 52 పరుగులు చేయాల్సిన దశలో బ్యాటింగ్ కు వచ్చిన మహేంద్రుడు.. 11 బంతుల్లో 16 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. ధోనీ ఔట్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి ఖరారైంది.