
- మంజీరా, మూసీని గోదావరి నీటితో పునరుద్ధరిస్తున్నం
- పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
- భేటీలో ఇరిగేషన్ శాఖ పవర్ పాయింట్ ప్రజంటేషన్
హైదరాబాద్, వెలుగు: నదుల సంరక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఇరిగేషన్ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో భూగర్భ జలాలను రీచార్జ్ చేసేందుకు పలు చర్యలు తీసుకున్నామని, 5 నుంచి 6 మీటర్ల లోతులోనే నీటి లభ్యత ఉందని చెప్పింది. ‘రాష్ట్రంలో జీవం కోల్పోతున్న నదుల పునరుద్ధరణ’ అనే అంశంపై శనివారం హైదరాబాద్ లోని ఓ హోటల్లో రాజ్యసభ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశానికి ఇరిగేషన్ శాఖతో పాటు మైనింగ్, సింగరేణి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు హాజరయ్యారు. ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా రాష్ట్రంలో నీటి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మంజీరా నదిని పునరుద్ధరించేందుకు మల్లన్నసాగర్ నుంచి హల్ది వాగు ద్వారా నీటిని తరలిస్తున్నామని పేర్కొన్నారు. ఆ నది చుట్టుపక్కల పర్యావరణాన్ని కాపాడేందుకు చెట్లు నాటే కార్యక్రమం చేపట్టామని, పరివాహక ప్రాంతాన్ని స్థిరీకరిస్తున్నామని తెలిపారు.
మూసీనది శుద్ధిలో భాగంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ కు మల్లన్న సాగర్ నుంచి 5 టీఎంసీల నీటిని తీసుకెళ్లి మూసీలో గోదావరి నీళ్లు పారేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. అంతేకాకుండా మూసీకి ఇరువైపులా సుందరీకరణ పనులను చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గోదావరి నీటిని సమర్థంగా వినియోగించుకునేందుకు నీటిని ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లకు తరలిస్తున్నామని వివరించారు. కడెం పూడికతీతపైనా ఫోకస్ పెట్టామన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాన్ని స్థిరీకరిస్తున్నామని తెలిపారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు, లోయర్ మానేరుకు లిఫ్ట్ చేస్తున్నామన్నారు. మిడ్‌మానేరు, లోయర్ మానేరుల్లో పూడికతీత పనులను చేపట్టామని తెలిపారు.