గ్రేటర్ సిటీగా కరీంనగర్..?

 గ్రేటర్ సిటీగా కరీంనగర్..?

కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు 6 గ్రామాల విలీన ప్రతిపాదన 
ప్రపోజల్స్​ రెడీ చేయాలని  కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంత్రి పొన్నం లేఖ 
ప్రాసెస్ పూర్తయితే స్టేట్ లో మూడో గ్రేటర్ సిటీగా కరీంనగర్

కరీంనగర్, వెలుగు: గ్రేటర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి. కరీంనగర్ సిటీని ఆనుకుని ఉన్న కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్, దుర్శేడు, గోపాల్ పూర్, కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు  మండలంలోని మల్కాపూర్, చింతకుంట,  లక్ష్మీ పూర్ గ్రామాలు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ పమేలా సత్పతికి తాజాగా లేఖ రాశారు.

6 గ్రామాలతోపాటు కొత్తపల్లి మున్సిపాలిటీ కరీంనగర్ సిటీకి కేవలం 10 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయని, సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విలీనం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని లేఖలో సూచించారు. ‘ఆ గ్రామాలు కరీంనగర్ లో కలిసేనా’ అనే హెడ్డింగ్ తో జులై 28న  వీ6 వెలుగులో  స్టోరీ పబ్లిష్ అయిన విషయం తెలిసిందే. స్పందించిన మంత్రి పొన్నం ఆ గ్రామాలను కరీంనగర్ బల్దియాలో విలీనం చేస్తామని అదే రోజు ప్రకటించారు. 

మూడో గ్రేటర్ సిటీగా కరీంనగర్

కరీంనగర్ పట్టణం1958లో  మున్సిపాలిటీగా ఆవిర్భవించగా.. 1987లో గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయింది.  ఆ తర్వాత  జనాభా పెరగడం, పట్టణం క్రమంగా విస్తరించడంతో 2005లో మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌గా అప్పటి ప్రభుత్వం గుర్తించింది.  కార్పొరేషన్ అయ్యాక రెండు దశాబ్దాల్లో అనూహ్యంగా విస్తరించింది. వేగంగా పెరిగిన అర్బనైజేషన్‌‌‌‌‌‌‌‌తో  చుట్టూ ఉన్న సుమారు 12 గ్రామాలు ఇందులో కలిసిపోయాయి.

 ఈ క్రమంలోనే  కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఎంపికయ్యాక 2019 జూన్ లో పక్కనే ఉన్న పద్మానగర్‌‌‌‌‌‌‌‌, రేకుర్తి, సీతారాంపూర్‌‌‌‌‌‌‌‌, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్‌‌‌‌‌‌‌‌, అల్గునూర్‌‌‌‌‌‌‌‌, సదాశివపల్లి గ్రామాలను బల్దియాలో విలీనం చేశారు. 2020 జనవరిలో విలీన గ్రామాలను కలిపి 50 వార్డులను 60 డివిజన్లుగా విభజించి ఎన్నికలు నిర్వహించారు. దూరంగా ఉన్న సదాశివపల్లి, వల్లంపహాడ్, అల్గునూరును విలీనం చేసినప్పటికీ.. అప్పటికే సిటీలో పూర్తిగా కలిసిపోయిన బొమ్మకల్,  చింతకుంట, మల్కాపూర్ గ్రామాలను కలపలేదు. కొన్ని రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఈ గ్రామాలను విలీనం చేయాలనే ఆరోపణలు ఉన్నాయి.

 కాగా 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల సందర్భంలోనే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గ్రేటర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. అప్పట్లో కొంత కసరత్తు జరిగినా మళ్లీ అంశం తెరమరుగైంది. గ్రేటర్ హోదా దక్కాలంటే జనాభా 5 లక్షలు దాటాలనే నిబంధన ఉంది. ప్రస్తుత జనాభా 4 లక్షలు ఉంటుందని అంచనా. మరో 6 గ్రామాలు,కొత్తపల్లి మున్సిపాలిటీని కలిపితే జనాభా మరికొంత 
పెరగనుంది.  

ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు లేనట్లే .. 

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ను ఆనుకుని ఉన్న జీపీలను బల్దియాలో కలపాలనే డిమాండ్ చాలా కాలంగా ఉన్న విషయం తెలిసిందే.  బొమ్మకల్, చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలు సిటీలో పూర్తిగా కలిసిపోయినప్పటికీ..  ప్రస్తుతం జీపీలుగానే కొనసాగుతున్నాయి. దుర్శేడు, గోపాల్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా సిటీకి సమీపంలోనే ఉన్నాయి.  ఈ ఏడాది జనవరిలో ఆయా పంచాయతీ పాలకవర్గాల పదవీకాలంకూడా ముగియడంతో స్పెషలాఫీసర్ల పాలన నడుస్తోంది.

మరో మూడు, నాలుగు నెలల్లో జీపీలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ ఉన్న పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారా ? లేదంటే కార్పొరేషన్ లో కలిపేస్తారా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.  ఈ క్రమంలోనే  పొన్నం ప్రభాకర్ కలెక్టర్ కు లేఖ రాయడంతో ఇక ఆ జీపీల్లో ఎన్నికలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు.