రాజన్న ఆలయ విస్తరణకు అడుగులు.. శృంగేరి పీఠాధిపతిని కలిసిన విప్ ఆది శ్రీనివాస్​, ప్రిన్సిపల్​ సెక్రటరీ

రాజన్న ఆలయ విస్తరణకు అడుగులు.. శృంగేరి పీఠాధిపతిని కలిసిన విప్ ఆది శ్రీనివాస్​, ప్రిన్సిపల్​ సెక్రటరీ

హైదరాబాద్, వెలుగు:  వేములవాడ రాజ రాజేశ్వరస్వామి ఆలయ విస్తరణపై రాష్ట్ర సర్కారు దృష్టిపెట్టింది. సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాలతో విప్ ఆది శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్  ఆదివారం శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ తీర్థను కలిశారు. రాజన్న ఆలయ విస్తరణ పనులపై చర్చించారు. ఆలయ నమూనాలను పరిశీలించి ముందుకెళ్లాలని, స్వామివారికి అర్చకులతో ఏకాంతంగా యధావిధిగా  పూజలు కొనసాగించాలని శృంగేరి పీఠాధిపతి సూచించారు.  

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ మాట్లాడుతూ.. వేములవాడ శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ తీర్థ స్వామి అనుమతులతో రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. గత నవంబర్ 20 న రాజన్న ఆలయ విస్తరణకు  సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సమక్షంలో శంకుస్థాపన చేశామని తెలిపారు. రాజన్న ఆలయ విస్తరణ పనులు జరిగే క్రమంలో రాజ రాజేశ్వరస్వామివారికి నిత్య పూజలు  అర్చక బృందంతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 

భక్తుల సౌకర్యార్థం భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలు నిర్వహిస్తారని తెలిపారు.  ఇందుకోసం  తాత్కాలిక క్యూలైన్లు, అభిషేక, కల్యాణ మండపాల నిర్మాణం కోసం శృంగేరి పీఠాధిపతి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. వారి వెంట ఎండోమెంట్ సలహాదారు గోవిందహరి, ఆర్ అండ్​బీ సీఈ రాజేశ్వర్ రెడ్డి, ఆలయ ఈవో వినోద్ రెడ్డి,  ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, అర్చకులు శరత్, సురేశ్​, శృంగేరి పీఠం తెలంగాణ బాధ్యులు రాధాకృష్ణ శర్మ, ఏఈ రామకిషన్ రావు, తదితరులున్నారు.