మనదేశం రిపబ్లికన్ కంట్రీగా మారి 70 ఏండ్లు గడిచాయి. కనీసం ఇప్పుడైనా ‘దేశాన్ని పాలించడం’, ‘దేశానికి నడిపించడం’ అనే విషయాల్లో సరికొత్త ఆలోచనలు చేయడం చాలా కీలకం. ప్రజల ద్వారా ఎన్నికైన ఏ నాయకుడైనా అప్పటికే ఉన్న అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ, యంత్రాంగం సాయంతో దేశాన్ని పరిపాలించగలరు. అయితే ఇది కేవలం దేశ పాలనను నిర్వహించడం మాత్రమే. ఇది స్ఫూర్తిదాయకంగా దేశానికి నాయకత్వం వహించడం ఎంత మాత్రం కాదు. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఓ దఫా ఎన్డీయే హయాంలో మినహా, దురదృష్టవశాత్తు తొలి 60 ఏండ్లు దేశంలో పరిపాలన మాత్రమే కొనసాగింది. ప్రధానిగా నరేంద్ర మోడీ పగ్గాలు స్వీకరించిన తర్వాత మాత్రమే దేశాన్ని పరిపాలించడం కాకుండా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు.
మనదేశాన్ని పూర్తిగా రీబిల్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతీయ విలువలే కేంద్రంగా ఈ పునర్నిర్మాణం జరగాలి. దేశ స్వాతంత్ర్యం సమయంలో ఆనాటి ముఖ్య నేతల ఆధ్వర్యంలో దేశ నిర్మాణ ప్రక్రియ అన్నది లేకుండా ఒక జాతి అర్ధరాత్రి మేల్కొన్న విషయాన్ని మనం ఒకసారి ఊహించుకోవాలి. దేశ నిర్మాణమన్నది లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ వర్గం ద్వారా నిర్వహించేది దేశ నిర్మాణమని, దేశాన్ని పరిపాలించడం అని చాలా మంది భావించారు. కానీ, అది కేవలం పరిపాలన మాత్రమే. ఇప్పటికైనా ‘దేశాన్ని పాలించడం’, ‘దేశాన్ని నడిపించడం’ అనే విషయాల్లో సరికొత్త ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది.
దేశానికి నాయకత్వం వహిస్తున్న మోడీ
2014లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ దేశాన్ని పరిపాలించడం కాకుండా, దేశానికి నాయకత్వం వహిస్తున్నారు. అప్పటి వరకూ ఉన్న పరిస్థితులను మారుస్తూ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. నెమ్మది నెమ్మదిగా ఎదగడం కాకుండా వ్యూహాత్మక దూకుడుతో దేశం ముందుకు సాగేలా ఎన్నో సానుకూల చర్యలు తీసుకుంటున్నారు. వీటి ద్వారా దేశం త్వరితగతిన అభివృద్ధి చెందేలా ప్రయత్నిస్తున్నారు.
సంస్కరణ–పనితీరు–మార్పు (రీఫామ్–పర్ఫామ్–ట్రాన్స్‌ఫామ్) అన్నది ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ఎజెండా. దాని ముఖ్య ఉద్దేశం ‘దేశాన్ని రీబిల్ట్ చేయడం’. ఇండియా సెంట్రిక్ వాల్యూ సిస్టం ఆధారంగా 70 ఏండ్ల యంగ్ రిపబ్లిక్ ను రీ బిల్ట్ చేయడానికి సంబంధించి నాకు స్పష్టమైన విజన్ ఉంది. ప్రగతిశీల, సుసంపన్నమైన దేశం కోసం ఇది చక్కని పరిష్కారమని నేను బలంగా నమ్ముతున్నాను. పటిష్టమైన విలువలతో కూడిన వ్యవస్థ ద్వారా దేశాన్ని రీషేప్ లేదా రీబిల్డ్ చేయడానికి తీసుకోవాల్సిన కొన్ని చర్యలను మీతో నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను.
నేషనల్ ప్రైడ్
నేషనల్ వాల్యూస్ క్వాలిటీ అనేది దేశ గౌరవాన్ని పెంచుతుంది. అదృష్టవశాత్తు, జ్ఞానదాయక నాగరికత, సనాతన ధర్మం, సానుకూల విలువలు పుణికి పుచ్చుకున్న మూలాలు కలిగి ఉండటంతో అవన్నీ మనకు తెలియకుండానే ఒంటబట్టాయి. శతాబ్దాలుగా అణిచివేత, బానిసత్వం, విదేశీ శక్తుల దాడులు అనేకం జరిగినా ఈ అనిర్వచనీయ భారతీయ విలువలు ఇప్పటికీ మనలోనూ, భారత జాతిలోనూ పదిలంగా నిలిచి ఉన్నాయి. దేశంలో, పౌరుల్లో జాతీయ విలువల అమలు, రూపకల్పన, స్వీకరణకు జాతి గౌరవమన్నది అత్యంత కీలకం. విఫల దేశాలు, విఫలమవుతున్న దేశాలు, విచ్ఛిన్న దేశాలు, దుష్ట దేశాల ఉదాహరణలు ప్రపంచవ్యాప్తంగా అనేకం ఉన్నాయి. కొన్ని రాజ్యాలు క్రియాశీలంగా ఉన్నప్పటికీ ఆ దేశ పౌరుల్లో జాతి గౌరవమన్నది మచ్చుకు కూడా కనిపించదు. ఆ దేశాలు అలా కావడానికి వాటికి ఘనమైన విలువలతో కూడిన గతమన్నది వారసత్వంగా లేకపోవడం లేదా నేటి కాలానికి అవసరమైన నిర్వచించబడిన విలువల బంధం లేకపోవడం కారణం కావచ్చు. అయినప్పటికీ, చక్కని భవిష్యత్ కోసం వాటికీ ఇంకా అవకాశం ఉంది. ఒక స్వరూపాత్మకమైన విలువలతో కూడిన మార్గదర్శకాలను రూపొందించలేక 60 ఏండ్ల సుదీర్ఘకాలం పాటు దేశాన్ని చీకట్లో మనుగడ సాగించినందుకు ఆకాశంలోని తారలకు మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి.
నేషనల్ ఐడెంటిటీ
భిన్నమైన రాష్ట్రాలతో కూడిన మన దేశంలో చిరకాలం మన్నే ఐక్యత, సమగ్రత కోసం అనేక బంధాలు కావాలి. ఏకైక గుర్తింపు కోసం జాతీయ గుర్తింపు అన్నది అత్యంత కీలకమైన బంధం. బహుళ గుర్తింపులను సాకుగా తీసుకొని దేశాన్ని చీల్చేందుకు దేశంలోని విచ్ఛిన్న శక్తులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయి. మతం, జాతి, కులాన్ని ఆయుధాలుగా చేసుకుని దేశాన్ని అస్థిరపరచడం వేర్పాటువాదులకు అలవాటైపోయింది. జాతీయ గుర్తింపునకు అవరోధంగా నిలిచి, సామాజిక సామరస్యానికి విఘాతం కలిగిస్తూ ఐక్యంగా ఉన్న దేశాన్ని ఇవి అస్థిరపరిచే సాధనాలే. ఐక్యంగా, శక్తివంతమైన ఒక జాతి నిలిచి ఉండాలంటే బలమైన బంధాలు అవసరం. అలాంటి బంధాల వలన ఆ జాతి సామరస్యంగా, శక్తిమంతంగా, శాంతియుతంగా, ప్రగతిశీలకంగా నిలుస్తుంది. జాతి నిర్మాణాన్ని చేపట్టకపోతే తద్వారా ఎదురయ్యే పరిణామాలు స్వల్పకాలంలోనే కాదు దీర్ఘకాలంలోనూ జాతికి విఘాతం కలిగిస్తాయి.
2021తో ప్రారంభమైన ఈ కొత్త దశాబ్దంలో దేశ పునర్నిర్మాణమన్నది మన దేశం చేపట్టాల్సిన ముఖ్యమైన చర్యల్లో ఒకటి. నిర్మాణాత్మకమైన మార్గదర్శకంతో కూడిన ఈ శక్తిని వెలికితీస్తే భారత్‌ను మించిన దేశం ప్రపంచంలో మరొకటి ఉండదు.
నేషనల్ వాల్యూస్ను డిజైన్ చేయడం
వాల్యూస్ అనేవి కేవలం నైతికపరమైన మార్గదర్శకాలు కావనే విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. గతంలో విలువలు అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. అది అనేక సందర్భాల్లో దుర్వినియోగం అయ్యింది. విలువలనేవి చాలా ప్రాధాన్యతతో కూడుకున్నవి. ఒక వ్యక్తి సొంతంగా కలిగి ఉండే విలువలను వ్యక్తిగత విలువలుగా పరిగణిస్తారు. అదే జాతి అంది పుచ్చుకుంటే వాటిని నేషనల్ వాల్యూస్ అంటారు.
దురదృష్టవశాత్తు, ఒక దేశంగా మనం ఇప్పటి వరకు ఇండియన్లకు సంబంధించి పర్సనల్ వాల్యూస్, నేషనల్ వాల్యూస్ను సరిగ్గా నిర్వచించుకోలేకపోయాం. ప్రాధాన్యతతో కూడిన విలువల వ్యవస్థ లేకపోతే వ్యక్తులకు దిశా, మార్గదర్శనం లోపిస్తుంది. దేశం విషయంలోనూ అలాగే జరుగుతుంది. జనాభా, పరిమాణం, భిన్నత్వం, ఆర్థిక వ్యవస్థతో కూడిన మన దేశంలో ఇలాంటి వాటిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉన్నా ఇప్పటి వరకూ అది జరగలేదు. ఇప్పటికైనా ఈ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కనీసం ఇప్పుడైనా నిర్మాణాత్మక నేషనల్ వాల్యూస్ ఫ్రేం వర్క్‌తో మన రిపబ్లికన్ కంట్రీని రీ బిల్ట్ చేయాలి.– కె.కృష్ణసాగర్ రావు
బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి
ఇవి కూడా చదవండి..
గెస్ట్ లేకుండా రిపబ్లిక్ డే.. 55 ఏండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే
6 రోజుల్లో 10 లక్షలు… ‘‘టీకా’’లో మనదే రికార్డు