అంగన్ వాడీల బలోపేతానికి రాష్ట్ర సర్కార్ చర్యలు : వాకాటి కరుణ

అంగన్ వాడీల బలోపేతానికి రాష్ట్ర సర్కార్ చర్యలు :  వాకాటి కరుణ

వికారాబాద్, వెలుగు: అంగన్ వాడీల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు. బుధవారం వికారాబాద్ కలెక్టరేట్ లో అంగన్ వాడీల్లో అందించే పౌష్ఠికాహారం, చిన్నపిల్లలకు బోధించే పాఠ్య ప్రణాళిక, ఆటపాటలపై సీడీపీఓలు, సూపర్ వైజర్లతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్ వాడీల్లో  పిల్లలకు ఆటలు, పాటలతో బోధించాలని, పౌష్ఠికాహార లోపం కలిగిన పిల్లలను గుర్తించి బాలామృతం అందించాలని సూచించారు.  జిల్లాలో 1,079 మందికి అంగ వైకల్యం ఉన్నట్టు నమోదు చేశామని, వీరికి నెల రోజుల్లో సదరం క్యాంపులు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులను అందించాలని తెలిపారు.  అనంతరం వికారాబాద్ పరిధిలోని ఎన్నేపల్లి, శివారెడ్డి పేట అంగన్ వాడీ కేంద్రాలను కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు.  వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, ఇన్ చార్జ్  అడిషనల్ కలెక్టర్ సుధీర్, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎంహెచ్ఓ పాల్వన్ కుమార్, డీసీహెచ్ఎస్ ప్రదీప్ కుమార్, ఇన్ చార్జ్ డీడబ్ల్యూవో వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు.