ఖమ్మం  జిల్లాలో టూరిజం అభివృద్ధికి చర్యలు :డీఎఫ్​వో సిద్ధార్థ్ విక్రమ్​ సింగ్ 

ఖమ్మం  జిల్లాలో టూరిజం అభివృద్ధికి చర్యలు :డీఎఫ్​వో సిద్ధార్థ్ విక్రమ్​ సింగ్ 

ఖమ్మం, వెలుగు :  జిల్లాలో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్​ సింగ్ తెలిపారు. శనివారం జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మంలో అటవీ డివిజన్​ ఆఫీస్​ను ఏర్పాటు చేసి వందేళ్లు అయిన సందర్భంగా వివిధ కార్యక్రమాలను ప్లాన్​ చేశామని వివరించారు.

జిల్లాలోని 22 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 7 వేల మంది విద్యార్థులకు అర్బన్​ పార్కులతో పాటు పులిగుండాల ప్రాజెక్టు దగ్గర అటవీ జీవ జాతులను ప్రత్యక్షంగా చూపిస్తామన్నారు. ఈ సందర్భంగా సుమారు 30 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కనకగిరి కొండల్లో ఉన్న పక్షిజాతులు, జంతువులు, మొక్కలు, పలు రకాల చెట్ల గురించి హైదరాబాద్​ నుంచి వచ్చిన 8 మంది టీమ్​ ఆధ్వర్యంలో సర్వే జరుగుతోందని చెప్పారు.

త్వరలోనే శని, ఆదివారాల్లో కనకగిరి కొండల్లో టూరిస్టులకు క్యాంపింగ్ ఏర్పాటు చేసుకునే అనుమతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇక అటవీ చట్టాల గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. వన్​ యాప్​ ద్వారా అటవీ శాఖ సిబ్బంది పనితీరును కమాండ్​ కంట్రోల్ సెంటర్​ నుంచే పర్యవేక్షించేలా టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని చెప్పారు.

ఇక సోలార్​ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అడవుల్లోకి వెళ్తున్న వారిపై నిఘాపెట్టామన్నారు. శాటిలైట్ ద్వారా నిఘా ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కడైనా ఫారెస్ట్ ఫైర్​ జరిగితే వెంటనే అటవీశాఖకు అలర్ట్ వచ్చే విధంగా టెక్నాలజీని వాడుతున్నామని వివరించారు. సమావేశంలో ఎఫ్​డీవో మంజుల, కృష్ణారావు, ఎఫ్​ఆర్​వోలు నాగేశ్వరరావు,  శ్రీనివాసరావు పాల్గొన్నారు.