మొక్కల పేరుతో లక్షలు వృథా .. బీఆర్ఎస్ హయాంలో ఆక్సిజన్ పార్కు ఏర్పాటుకు అడుగులు

మొక్కల పేరుతో లక్షలు వృథా .. బీఆర్ఎస్ హయాంలో ఆక్సిజన్ పార్కు ఏర్పాటుకు అడుగులు
  • కుడా నుంచి రూ.4 కోట్లు కేటాయింపు
  • వివిధ రకాల మొక్కలు, కన్ స్ట్రక్షన్ పేరున రూ.80 లక్షలు ఖర్చు
  • ఆ తరువాత చేతులెత్తేసిన అప్పటి లీడర్లు, ఆఫీసర్లు
  • తుమ్మళ్లు, పిచ్చిమొక్కలతో నిండిపోయిన పార్కు
  • నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు జనాలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్​ పార్క్ పేరుకే పరిమితమైంది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.4 కోట్ల అంచనా వ్యయంతో 'కుడా' ఆధ్వర్యంలో ఆక్సిజన్​ పార్క్ పనులు స్టార్ట్ చేయగా.. వివిధ రకాల మొక్కలు, కాంపౌండ్ నిర్మాణం కోసం ఖర్చు చేసి ఫాయిదా లేకుండా పోయింది. రూ.లక్షలు వెచ్చించి అక్కడ పార్క్​ నిర్మాణం చేపట్టగా.. అందులో కనీసం ఒక్క మొక్క నాటిన దాఖలాలు లేవు. దీంతో ఆ స్థలమంతా ఇప్పుడు తుమ్మ చెట్లు, పిచ్చిమొక్కలతో నిండిపోగా, మొక్కల పేరున పెద్ద ఎత్తున నిధులు గోల్ మాల్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

టూరిస్ట్​లను ఆకర్షించేలా వంద ఎకరాల్లో ప్లాన్​

రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని కట్టడి చేయడంతో పాటు  నగరానికి వచ్చే టూరిస్టులను ఆకర్షించేందుకు 'కుడా' ఆధ్వర్యంలో  ఆక్సిజన్​ పార్క్​ ఏర్పాటుకు 2019లో ప్రతిపాదనలు చేశారు.  ఎన్​హెచ్​-163ని ఆనుకుని గ్రేటర్​ వరంగల్ పరిధి రాంపూర్​ చెరువు పక్కనే   దాదాపు వంద ఎకరాల మేర ప్రభుత్వ స్థలం ఉండగా, అందులోనే ఈ ఆక్సిజన్​ పార్క్​ ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేశారు. ఇందులో దాదాపు 5.29 ఎకరాల్లో అర్బన్​ పార్క్​, మరో 25 ఎకరాల్లో మియావాకీ ఫారెస్ట్​, మిగతా స్థలంలో వాకింగ్​ ట్రాక్స్​, ఫుడ్​ కోర్ట్స్​, పిల్లలకు ఉపయోగపడేలా ప్లే వే ఎక్విప్​మెంట్ తదితర వసతులు కల్పించేలా ప్లాన్​ చేశారు.

 టూరిస్టులను ఆకర్షించేలా కాకతీయుల కళానైపుణ్యం ఉట్టిపడేలా రాతి కట్టడాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేశారు. ఇందుకు మొత్తంగా రూ.4 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టి, జీడబ్ల్యూఎంసీ ఎన్నికల ముందు అప్పటి మంత్రి కేటీఆర్​ చేతుల మీదుగా ఆక్సిజన్​ పార్క్​ కు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత అప్పటి పాలకులు, అధికారులు హడావుడి చేసి వదిలేశారు. 

రూ. లక్షలు పెట్టినా ఒక్క మొక్క లేకపాయే

ఆక్సిజన్​ పార్క్​ లో ఆహ్లాదాన్ని అందించే వివిధ రకాల పూలు, పండ్ల రకాల మొక్కల కోసమని దాదాపు రూ.10 లక్షలు ఖర్చు పెట్టారు. ఆక్సిజన్​ పార్క్​ ఆర్చీ, చుట్టూ కాంపౌండ్​ కోసం రూ.70 లక్షల వరకు వెచ్చించారు. కానీ ఇప్పుడు ఆ స్థలంలో ఒక్క మొక్క కూడా కనిపించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  మొక్కల పేరున ఫండ్స్​ మిస్​ యూజ్​ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లీడర్లు, ప్రజాప్రతినిధులు దాని వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఇప్పుడు ఆ పార్క్​ స్థలం మొత్తం తుమ్మ చెట్లతో నిండిపోయింది. కొంతమంది అదే పార్క్ స్థలాన్ని డంప్​ యార్డుగా కూడా వినియోగిస్తుండటంతో ప్లాస్టిక్​ వ్యర్థాలతో ఆ పరిసరాలు కంపు కొడుతున్నాయి. అంతేగాకుండా కాకతీయుల శైలిలో ఏర్పాటు చేసేందుకు తెచ్చిన శిలలు కూడా పిచ్చిమొక్కల మధ్య దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా లీడర్లు, ఆఫీసర్లు చొరవ తీసుకుని  ఆక్సిజన్ పార్కును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చొరవ తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

ఉగాది లోపు కొత్త రూపు తెస్తం

రాంపూర్​ ఆక్సిజన్​ పార్క్​ ను డెవలప్​ చేసేందుకు మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేశాం. దానికి సంబంధించిన డిజైనింగ్​ ఫైనల్​ కావాల్సి ఉంది. సాధ్యమైనంత తొందర్లోనే పనులు చేపట్టి, ఉగాదిలోగా ఆక్సిజన్​ పార్క్​ కు కొత్త రూపు తీసుకొస్తం. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడంతో పాటు స్వచ్ఛమైన ఆక్సిజన్​ అందించేలా పార్క్​ ను డెవలప్​ చేస్తం.

ఇనుగాల వెంకట్రామ్​ రెడ్డి, కుడా చైర్మన్