![ఐఫోన్ 14పై వ్యంగ్యంగా ఈవ్ జాబ్స్ మీమ్](https://static.v6velugu.com/uploads/2022/09/Steve-Jobs-daughter-mocks-iPhone-14-with-meme-see-post-here_YoQH0273jU.jpg)
స్మార్ట్ ఫోన్ దిగ్గజం ‘యాపిల్’ తీసుకొచ్చే కొత్త ఐఫోన్ల మోడల్స్ కు భలే క్రేజీ ఉంటుంది. వాటి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే మొబైల్ లవర్స్ ఎంతోమంది ఉంటారు. ధర ఎంతైనా సరే లెక్క చేయకుండా.. రిలీజ్ కాగానే క్యూ కట్టి మరీ కొనేస్తుంటారు. సెప్టెంబరు 7న ఐఫోన్ 14, ఐఫోన్ ప్లస్, ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడళ్లను యాపిల్ కంపెనీ విడుదల చేసింది. ఈనేపథ్యంలో కొత్త ఐఫోన్ మోడళ్లపై సోషల్ మీడియా వేదికగా ఎన్నో కామెంట్స్, మీమ్స్ వెల్లువెత్తాయి. నెటిజన్స్ భిన్న విభిన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఇలా కామెంట్స్ చేసిన నెటిజన్స్ జాబితాలో ఏకంగా యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కూతురు ఈవ్ జాబ్స్ కూడా చేరిపోయారు.
ఆమె పోస్ట్ చేసిన ‘మీమ్’పై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ డిబేట్ జరుగుతోంది. ఆ మీమ్ లో.. ఒక వ్యక్తి తాను అప్పటికే ధరించి ఉన్న షర్ట్ ను పోలిన మరో షర్ట్ ను కొనుగోలు చేస్తున్న దృశ్యం ఉంది. కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ 14 వర్షన్ లోనూ.. పాత ఐఫోన్ 13 వర్షన్ ను పోలిన హార్డ్ వేరే ఉందనే సందేశాన్ని ఇచ్చేలా ఈవ్ జాబ్స్ పోస్ట్ చేసిన మీమ్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొత్త ఐఫోన్ 14 వర్షన్ లోని కెమెరా హార్డ్ వేర్, స్క్రీన్ కూడా చూడటానికి అచ్చం ఐఫోన్ 13 ను పోలిన విధంగానే ఉన్నాయని ఇంకొందరు అంటున్నారు.
ఐఫోన్ 14 ఎంతో అడ్వాన్స్డ్
అయితే మొబైల్ గాడ్జెట్స్ నిపుణులు మాత్రం నెటిజన్ల వాదనతో విభేదిస్తున్నారు. ఐఫోన్ 14 అనేది పాత మోడల్ ఐఫోన్ 13 కంటే ఎంతో అడ్వాన్స్డ్ గా ఉందని చెబుతున్నారు. ఐఫోన్ 14లో అధునాతనమైన ‘ఈ సిమ్’ సౌకర్యం ఉందని గుర్తు చేస్తున్నారు. ప్రత్యేకించి అమెరికాలో విక్రయించే ఐఫోన్ 14 మోడళ్లలో సిమ్ ట్రేలు ఉండవని, ఇతర దేశాల్లో విడుదలయ్యే ఐఫోన్ 14 మోడళ్లలో మాత్రం ఒక సిమ్ ట్రే ఉంటుందని అంటున్నారు. ఐఫోన్ 14 ద్వారా లేటెస్ట్ ‘శాటిలైట్ ఎస్ఓఎస్ కనెక్టివిటీ’ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా.. శాటిలైట్ పరిజ్ఞానాన్ని వాడుకొని ఎస్ఓఎస్ మెసేజ్ లు పంపగలగడం ‘శాటిలైట్ ఎస్ఓఎస్ కనెక్టివిటీ’ ఫీచర్ ప్రత్యేకత అని వివరిస్తున్నారు. ‘శాటిలైట్ ఎస్ఓఎస్’ సర్వీసును ఐఫోన్ 14 వినియోగదారులకు అమెరికా, కెనడా దేశాల్లో రెండేళ్ల పాటు ఉచితంగా అందిస్తారు. ఆ తర్వాత దానికి చార్జ్ వసూలు చేస్తారు. యాక్సిడెంట్స్ వంటివి జరిగిన సందర్భాల్లో మొబైల్ ఫోన్ ద్వారా ఎమర్జెన్సీ కాల్స్ చేసుకునేందుకు ఉపయోగపడే ‘క్రాష్ డిటెక్షన్’ ఫీచర్ కూడా ఐఫోన్ 14లో ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ధరలు ఇవీ..
ఐఫోన్ 14 బేసిక్ మోడల్ ప్రారంభ ధర రూ.79,900 ఉండగా.. ఐఫోన్ 14 ప్లస్ మోడల్ ధర రూ.89,900 ఉంది. ఇక ఐఫోన్ 14 ప్రో మోడల్ ధర రూ.1,29,900, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్ ధర రూ.1,39,900 ఉంది.
ఈవ్ జాబ్స్ ఏం చేస్తుంటుంది ?
ఇప్పుడు ఈవ్ జాబ్స్ వయసు 24 ఏళ్లు. ఆమెకు తండ్రి స్టీవ్ జాబ్స్ నుంచి బోలెడంత ఆస్తి వచ్చింది. దాన్ని చూసుకొని ఆమె రెస్ట్ తీసుకోవడం లేదు. చిన్నప్పటి నుంచి తనకు ఎంతో ఇంట్రస్ట్ కలిగిన మోడలింగ్ రంగంలోకి ఈవ్ జాబ్స్ అడుగుపెట్టారు. ప్రస్తుతం పలు అమెరికన్ ఫ్యాషన్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. తండ్రి స్టీవ్ జాబ్స్ బతికి ఉండగా.. కూతురు ఈవ్ కు గుర్రపు స్వారీ కూడా నేర్పించారు. 2020 సంవత్సరంలో జపాన్ లో జరగాల్సిన ఒలింపిక్స్ కోసం అమెరికా హార్స్ రైడింగ్ టీమ్ కు ఎంపికయ్యారు. అయితే కరోనా కారణంగా ఆ పోటీలు వాయిదాపడ్డాయి. లేదంటే గుర్రపు స్వారీలోనూ అంతర్జాతీయ వేదికపై తనను తాను నిరూపించుకునే అవకాశం ఈవ్ జాబ్స్ కు దక్కి ఉండేది.