IPL 2025: మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ..? ఆసీస్ మాజీ కెప్టెన్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను

ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ భారీ స్థాయిలో జరగనుంది. గరిష్ట పరిమితి మూడేళ్లు ముగియడంతో సగానికి పైగా ఆటగాళ్లందరూ వేలంలోకి రానున్నారు. ఈ మెగా వేలానికి ఆస్టేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అందుబాటులో ఉంటాడని తన నిర్ణయాన్ని తెలిపాడు. "నేను మరోసారి ఐపీఎల్ లో ఆడాలనుకుంటున్నాను. ఐపీఎల్ 2025 వేలంలో పాల్గొనాలని ఉంది. అని స్మిత్ CODE స్పోర్ట్స్‌తో చెప్పాడు. స్మిత్ ఆక్షన్ లోకి వస్తే ఈ సారి అతనికి  భారీ ధర పలికే అవకాశం కనిపిస్తుంది. ఈ స్టార్ బ్యాటర్ పై ఈ సారి ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

స్మిత్ చివరిసారిగా 2021 ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. ఆ తర్వాత జరిగిన మూడు ఐపీఎల్ వేలంలోనూ ఈ ఆటగాడిని ఎవరూ కొనలేదు. వేగంగా ఆడలేడనే కారణంతో పక్కన పెట్టేశారు. అయితే స్మిత్ ప్రస్తుత ఫామ్ అద్భుతంగా ఉంది. ఇటీవల ముగిసిన మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో సత్తా చాటాడు. వాషింగ్ టన్ ఫ్రీడం జట్టుకు కెప్టెన్ గా టైటిల్ అందించడంతో పాటు.. ఈ టోర్నీలో     అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఫైనల్‌లో 52 బంతుల్లో 88 పరుగులు చేసి టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. 

ALSO READ | Kenya cricket: కెన్యా హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్

స్మిత్  ఐపీఎల్ ప్రయాణం 2010 లో ప్రారంభమైంది. ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, పూణే వారియర్స్ జట్ల తరపున ఆడాడు. 2017లో రైజింగ్ పూణే సూపర్ జయింట్స్ కెప్టెన్ గా జట్టును నడిపించాడు. ఇప్పటివరకు ఐపీఎల్ కెరీర్ లో స్మిత్ 103 మ్యాచ్ లాడాడు. ఒక సెంచరీ.. 11 అర్ధ సెంచరీలతో సహా 2,485 పరుగులు చేశాడు. 2021లో ఆడిన చివరి సీజన్ లో 8 మ్యాచ్ ల్లో 152 పరుగులు మాత్రమే చేయగలిగాడు.