Steve Smith: రిటైర్మెంట్ ఆలోచన లేదు.. భారత్‌పై సిరీస్ గెలవడమే లక్ష్యం: ఆసీస్ స్టార్ బ్యాటర్

Steve Smith: రిటైర్మెంట్ ఆలోచన లేదు.. భారత్‌పై సిరీస్ గెలవడమే లక్ష్యం: ఆసీస్ స్టార్ బ్యాటర్

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వయసు ఇటీవలే 35 ఏళ్ళు దాటింది. ఆధునిక క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటర్ గా పరిగణించబడే స్మిత్ పై రిటైర్మెంట్ వార్తలు వస్తున్నాయి. టీ20ల్లో స్థానం కోల్పోవడం.. వన్డేల్లో అడపాదడపా అవకాశాలు.. టెస్టుల్లో పేలవ ఫామ్. దీంతో ఈ ఆసీస్ బ్యాటర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చిందటున్నారు. అయితే తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలను స్మిత్ కొట్టి పారేశాడు. తనకు అలాంటి ఆలోచనలు లేవని తేల్చి చెప్పాడు.

రిటైర్మెంట్ పై స్టీవ్ స్మిత్ స్పందిస్తూ ఇలా అన్నాడు.. “ప్రస్తుతం నేను నా ఆటను ఆస్వాదిస్తున్నాను. చాలా రిలాక్సుగా ఉన్నాను. రిటైర్మెంట్ గురించి నాకు ఎలాంటి ప్రణాళికలు లేవు. సమ్మర్ లో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్నాను. భారత్ చాలా బలమైన జట్టు. ఈ సిరీస్ లో మాకు గట్టి ఛాలెంజ్ గా నిలుస్తుంది. ప్రపంచంలో రెండు అత్యుత్తమ టెస్ట్ జట్లు ఆడబోయే ఈ ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్నాను". అని స్మిత్ చెప్పుకొచ్చాడు. 

35 ఏళ్ల అతను 109 టెస్ట్ మ్యాచ్‌ల్లో 56.97 సగటుతో 9685 పరుగులు చేశాడు. కనీసం 5000 టెస్ట్ పరుగులు చేసిన బ్యాటర్‌లలో, బ్రాడ్‌మాన్ 99.94 తర్వాత ఆస్ట్రేలియన్‌లలో ఇది రెండో అత్యుత్తమ సగటు. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత టెస్ట్ క్రికెట్‌లో ఓపెనర్‌గా స్మిత్ అవతారమెత్తాడు. ఎనిమిది ఇన్నింగ్స్ ల్లో 28 సగటుతో 171 పరుగులు మాత్రమే చేశాడు.