IND vs AUS 3rd Test: టీమిండియాపై అరుదైన రికార్డ్.. 535 రోజుల తర్వాత స్మిత్ సెంచరీ

IND vs AUS 3rd Test: టీమిండియాపై అరుదైన రికార్డ్.. 535 రోజుల తర్వాత స్మిత్ సెంచరీ

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. గబ్బా టెస్టులో సెంచరీతో మెరిశాడు. 82 ఓవర్ మూడో బంతికి ఫైన్ లెగ్ మీదుగా సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 188 బంతుల్లో 12 ఫోర్లతో స్మిత్ తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఈ ఆసీస్ స్టార్ బ్యాటర్.. కెరీర్ లో పదేళ్ల తర్వాత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో తొలిసారి టాప్ 10 నుంచి నిష్క్రమించాడు. అయితే గబ్బా టెస్టులో మాత్రం అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించి 535 రోజుల తర్వాత టెస్టుల్లో సెంచరీ కొట్టాడు. 

టెస్ట్ కెరీర్ లో 33 వ సెంచరీ చేసిన స్మిత్ సెంచరీ అనంతరం 101 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్ లో వికెట్ కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత్ పై అంతర్జాతీయ క్రికెట్ లో స్మిత్ కు ఇది 15 వ సెంచరీ. దీంతో టీమిండియాపై అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాడిగా స్మిత్ అగ్ర స్థానంలో ఉన్నాడు. హెడ్ తో కలిస్ స్మిత్ నాలుగో వికెట్ కు 241 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. మరో ఎండ్ లో ట్రావిస్ హెడ్ భారీ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. టీ విరామం తర్వాత ఆస్ట్రేలియా ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. క్రీజ్ లో హెడ్ (149), మిచెల్ మార్ష్ (0) ఉన్నారు. 

Also Read :- హెడ్ మెరుపు సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా

3 వికెట్ల నష్టానికి 234 పరుగులతో చివరి సెషన్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ధాటిగా ఆడింది. హెడ్, స్మిత్ ఇద్దరూ బ్యాట్ ఝళిపించడంతో స్కోర్ బోర్డు వేగంగా ముందుకు కదిలింది. ఈ క్రమంలో స్మిత్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని బుమ్రా విడగొట్టాడు. కొత్త బంతితో స్మిత్ ను పెవిలియన్ కు చేర్చాడు. దీంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. భారత బౌలర్లలో బుమ్రాకు మూడు వికెట్లు దక్కాయి. నితీష్ రెడ్డికి ఒక వికెట్ పడగొట్టాడు.