
ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా ఓడిన గంటల వ్యవధిలోనే స్మిత్ రిటైర్ మెంట్ ప్రకటించడం గమనార్హం. ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన స్టీవ్ స్మిత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చివరి వన్డే మ్యాచ్ టీమిండియాపై ఆడాడు. 73 పరుగులు చేశాడు. 35 ఏళ్ల స్మిత్ వన్డే ట్రాక్ రికార్డ్ ఒక్కసారి పరిశీలిస్తే.. 170 వన్డే మ్యాచ్లు ఆడిన స్మిత్ 5800 పరుగులు చేశాడు. 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. 2016లో న్యూజిలాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో 164 పరుగులు చేసి తన వన్డే కెరీర్లో భారీ వ్యక్తిగత స్కోర్ను నమోదు చేసి సత్తా చాటాడు. లెగ్ స్పిన్ బౌలింగ్ చేసి 28 వికెట్లను తీసి ఆల్ రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఫీల్డింగ్లో కూడా 90 క్యాచ్లతో రాణించాడు.
వన్డే ఫార్మాట్ కు మాత్రమే స్మిత్ రిటైర్ మెంట్ ప్రకటించాడు. టెస్ట్ క్రికెట్, టీ20 ఫార్మాట్స్లో స్టీవ్ స్మిత్ కొనసాగుతాడు. వన్డేల్లో రిటైర్మెంట్ ప్రకటించడంపై స్మిత్ స్పందిస్తూ.. రెండు వరల్డ్ కప్స్ గెలిచి ఎన్నో జ్ఞాపకాలను పోగేసుకున్నానని.. వన్డే ఫార్మాట్లో ఆడిన ప్రతి నిమిషం తనకు మధుర జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని స్మి్త్ చెప్పాడు. 2027 వన్డే వరల్డ్ కప్కు నాయకత్వం వహించడానికి సమర్థులకు ఇది సరైన అవకాశమని.. వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నానని తన రిటైర్మెంట్పై స్మిత్ వ్యాఖ్యానించాడు.
ALSO READ : ఇండియా ప్రత్యర్థి ఎవరు? ఇవాళ (ఫిబ్రవరి 5) న్యూజిలాండ్, సౌతాఫ్రికా సెమీస్
ఇదిలా ఉండగా.. 2011 తర్వాత ఐసీసీ టోర్నీ నాకౌట్ రౌండ్‌లో తొలిసారి ఆసీస్ అంతుచూసి చాంపియన్స్ ట్రోఫీలో రికార్డు స్థాయిలో ఐదోసారి ఫైనల్లో అడుగు పెట్టింది. ఇదే జోరును ఆదివారం జరిగే ఫైనల్లోనూ కొనసాగిస్తే.. రోహిత్‌సేన చేతికి మరో ట్రోఫీ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఛేజ్ కింగ్ విరాట్ కోహ్లీ (98 బాల్స్‌లో 5 ఫోర్లతో 84) మరోసారి మాస్టర్ క్లాస్ ఆట చూపెట్టడంతో చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఐదోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. అతనికి తోడు శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42 నాటౌట్) అండగా నిలవడంతో.. మంగళవారం జరిగిన తొలి సెమీస్‌లో ఇండియా 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. తొలుత ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 రన్స్‌కు ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (96 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 73), అలెక్స్ క్యారీ (57 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 61) రాణించారు.