Steve Smith: బాల్ టాంపరింగ్ చేసినవాడే..క్రీడా స్ఫూర్తి చాటుకున్నాడు

Steve Smith: బాల్ టాంపరింగ్ చేసినవాడే..క్రీడా స్ఫూర్తి చాటుకున్నాడు

స్టీవ్ స్మిత్.. ప్రస్తుత జనరేషన్ లో స్టార్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో ఈ ఆసీస్ బ్యాటర్ టాప్ బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ విజయవంతంగా వెళ్తున్న సమయంలో 2018 లో బాల్ టాంపరింగ్ చేసి ఏడాది పాటు నిషేదానికి గురయ్యాడు. అప్పటి నుండి స్మిత్ పై జనాలకు చెడు అభిప్రాయం ఏర్పడింది. కంబ్యాక్ లో బ్యాటర్ గా రాణించినా..బాల్ టాంపరింగ్ చేసిన ముద్ర అలాగే ఉండిపోయింది. అయితే తాజాగా స్మిత్ చేసిన పనికి ప్రశంసలు కురుస్తున్నాయి. 
               
అడిలైడ్‌ వేదికగా ముగిసిన ఈ రోజు టెస్టులో తన క్రీడా స్ఫూర్తి చాటుకున్నాడు. హేజల్ వుడ్ వేసిన ఇన్నింగ్స్ 34 ఓవర్లో రెండో బంతికి షమర్ జోసెఫ్ బౌండరీ కొట్టాడు. ఈ సమయంలో అతని  షూ లేస్ ఊడిపోయాయి. చేతికి గ్లౌజులు ఉండడటంతో లేస్ కట్టుకోవడం కుదరలేదు. ఫీల్డర్ సహాయం కోసం ఎదురు చూస్తుండగా.. స్మిత్ ప్రత్యర్థి ప్లేయర్ జోసెఫ్ పరిస్థితిని అర్ధం చేసుకొని లేస్ కట్టి అందరి మనసులను గెలుచుకున్నాడు. ఓపెనర్ గా కొత్త ప్రయాణం ప్రారంభించిన స్మిత్.. ఈ మ్యాచ్ లో జోసెఫ్ వేసిన తొలి బంతికే ఔటయ్యాడు. ఈ మ్యాచ్ లో స్మిత్ తొలి ఇన్నింగ్స్ లో 12 పరుగులు చేసి ఔట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో 11 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.     

మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా విండీస్ పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 188 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆసీస్ 283 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 120 పరుగులకు ఆలౌట్ కాగా.. 26 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ వికెట్లేమీ కోల్పోకుండా ఛేజ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఆసీస్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ లోకి దూసుకెళ్లింది.