![SL vs AUS: పాంటింగ్‌ను వెనక్కి నెట్టిన స్టీవ్ స్మిత్.. టాప్‌లో టీమిండియా క్రికెటర్](https://static.v6velugu.com/uploads/2025/02/steve-smith-went-past-ricky-pontings-tally-of-196-catches-in-mens-tests_6spI7AbVBM.jpg)
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ రికీ పాంటింగ్ ను దాటాడు. అయితే స్మిత్ పాంటింగ్ పరుగుల రికార్డును కాకుండా.. అతని క్యాచ్ ల రికార్డ్ బద్దలు కొట్టాడు. ఫీల్డర్ గా టెస్ట్ క్రికెట్ లో పాంటింగ్ అత్యధిక క్యాచ్ ల రికార్డ్ బ్రేక్ చేసి టాప్ 5 లో స్థానం సంపాదించాడు. 116 టెస్టుల్లో 197 క్యాచ్ లు పట్టి పాంటింగ్ 196 క్యాచ్ ల రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్ కు ముందు 195 క్యాచ్ లతో ఉన్న స్మిత్.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో రెండు క్యాచ్ లు అందుకున్నాడు.
కామిందు మెండీస్ వికెట్ తీసి పాంటింగ్ రికార్డ్ సమం చేసిన స్మిత్.. ప్రభాత్ జయసూర్య క్యాచ్ తీసుకొని అతన్ని వెనక్కి నెట్టాడు. ఓవరాల్ గా ఈ లిస్టులో టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ 210 క్యాచ్ లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. జో రూట్(207,ఇంగ్లాండ్) మహేల జయవర్ధనే (205,శ్రీలంక), జాక్వెస్ కల్లిస్ (200, దక్షిణాఫ్రికా) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. టెస్ట్ క్రికెట్ లో స్లిప్ ఫీల్డర్ గా స్మిత్ కు టెస్ట్ క్రికెట్ లో మంచి పేరుంది. టెస్ట్ క్రికెట్ లో ఎన్నో సార్లు తన విన్యాసాలతో అసాధ్యమనుకున్న క్యాచ్ లను పట్టాడు.
ALSO READ | Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ.. యథావిధిగా ఇంగ్లండ్ - ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్
ఈ టెస్ట్ మ్యాచ్ లో స్మిత్ బ్యాటింగ్ లో అదరగొడుతున్నాడు. 71 పరుగులు చేసి ఆస్ట్రేలియాను ఆధిక్యం దిశగా తీసుకెళ్తున్నాడు. దీంతో రెండో రోజు రెండో టీ విరామానికి ముందు 3 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. క్రీజ్ లో స్మిత్, వికెట్ కీపర్ క్యారీ (46) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 70 పరుగులు వెనకబడి ఉంది. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 259 పరుగులకు ఆలౌట్ అయింది. కుశాల్ మెండీస్ (85), చండీమల్ (74) హాఫ్ సెంచరీలతో రాణించారు.
మెన్స్ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక క్యాచ్‌ల జాబితా
210: రాహుల్ ద్రవిడ్ (భారతదేశం) 164 మ్యాచ్‌ల్లో
207: జో రూట్ (ఇంగ్లాండ్) 152 మ్యాచ్‌ల్లో
205: మహేల జయవర్ధనే (శ్రీలంక) 149 మ్యాచ్‌ల్లో
200: జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా) 166 మ్యాచ్‌లలో
197: స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) 116* మ్యాచ్‌లలో
196: రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా),168 మ్యాచ్‌లలో