SL vs AUS: సెంచరీలతో హోరెత్తిస్తున్న స్మిత్.. ద్రవిడ్ రికార్డ్ సమం

SL vs AUS: సెంచరీలతో హోరెత్తిస్తున్న స్మిత్.. ద్రవిడ్ రికార్డ్ సమం

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీతో మెరిశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ రెండో రోజు ఆటలో అజేయ సెంచరీ (104*) తో ఆస్ట్రేలియాను ముందుకు తీసుకెళ్తున్నాడు. స్మిత్ ఇన్నింగ్స్ లో 9ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ ఆసీస్ బ్యాటర్ కు టెస్ట్ కెరీర్ లో ఇది 36వ శతకం. తొలి టెస్టులో 35వ సెంచరీతో దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, యూనిస్ ఖాన్, జయవర్ధనేలను వెనక్కి నెట్టిన స్మిత్.. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్, ఇంగ్లాండ్ క్రికెటర్ రూట్ 36 టెస్ట్ సెంచరీల రికార్డ్ సమం చేశాడు.   

టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడు స్మిత్. 41 సెంచరీలతో పాంటింగ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఓవరాల్ గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల లిస్టులో ద్రవిడ్, రూట్ లతో కలిసి 5వ స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో 51  సెంచరీలతో క్రికెట్ దిగ్గజం సచిన్ ఉన్నాడు. ప్రస్తుత టెస్ట్ క్రికెట్ లో రూట్ తో సమంగా అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా స్మిత్ కొనసాగుతున్నాడు. ఇటీవలే జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్మిత్ రెండు సెంచరీలు బాది ఫామ్ లోకి వచ్చాడు. అదే ఫామ్ ను శ్రీలంకపై కొనసాగిస్తున్నాడు.

ALSO READ | SL vs AUS: పాంటింగ్‌ను వెనక్కి నెట్టిన స్టీవ్ స్మిత్.. టాప్‌లో టీమిండియా క్రికెటర్

శ్రీలంకపై రెండు టెస్టుల్లో సెంచరీలు బాదాడు. చివరి 5 టెస్టుల్లో స్మిత్ కు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. 116 టెస్టుల్లోనే స్మిత్ తన 36 సెంచరీలు పూర్తి చేసుకోవడం విశేషం. స్మిత్ సెంచరీతో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు మూడో సెషన్ లో 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. స్మిత్ (104), క్యారీ (92) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 10 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉండడంతో ఈ మ్యాచ్ పై ఆస్ట్రేలియా పట్టు బిగించింది.