నెల అయినా బురదల్నే.. వరద నుంచి బయటపడని సిటీ కాలనీలు

హైదరాబాద్​లో వరద నుంచి బయటపడని కాలనీలు

100 కాలనీల్లో ఇంకా నీళ్లలోనే జనం.. బురదలోనే జీవనం..

ఇళ్లపై టెంట్లు వేసుకుని బతుకున్న పరిస్థితి

తిండికి, నీళ్లకు అష్టకష్టాలు.. రాత్రిళ్లు పాముల భయం

సర్కారు పట్టించుకోవడం లేదని ఆవేదన

హైదరాబాద్, వెలుగు: నెల కిందట.. కుండపోత వర్షం హైదరాబాద్​ను ముంచెత్తింది. వరదలకు కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. కొందరు నీళ్లలో కొట్టుకుపోయారు. ఇండ్లు కూలిపోయాయి. ప్రాణ, ఆస్తి నష్టంతో జన జీవనం అస్థవ్యవస్థమైంది. వేలాది మంది కట్టుబట్టలతో వేరే  ప్రాంతాలకు తరలిపోయారు. నెల రోజుల తర్వాత.. ఈ పాటికి వరద నీరంతా పోయి సిటీ మాములు స్థితికి రావాలి. కానీ గ్రౌండ్ లెవల్ లో రియాలిటీ వేరేలా ఉంది. హైదరాబాద్​లో దాదాపు 100 కాలనీలు వరద ముంపు నుంచి బయట పడలేదు. మురుగు నీరు బయటికి పోలేదు. ఇప్పటికీ జనం ఇండ్లపై టెంట్లు వేసుకుని బతుకుతున్నారు. కొన్ని కాలనీల్లో నీళ్లు అట్లనే ఉండగా, మరికొన్ని చోట్ల బురద, చెత్త పేరుకుపోయింది. సిటీలోని లోతట్టు ప్రాంతాలు ఇంకా వరదల నుంచి తేరుకోలేదు. చాలా ఇళ్లు నీటిలోనే ఉన్నాయి. దీంతో స్థానికులు ఇండ్లపై టెంట్లు వేసుకుని బతుకుతున్నారు. కొన్ని కాలనీల్లో నీళ్లు అట్లనే ఉండగా, మరికొన్ని చోట్ల బురద, చెత్త పేరుకుపోయింది.

నరకయాతన అనుభవిస్తూ..

సిటీలోని లోతట్టు ప్రాంతాలు వరదల నుంచి తేరుకోలేదు. చాలా ఇళ్లు నీటిలోనే ఉన్నాయి. దీంతో స్థానికులు ఇండ్లపై టెంట్లు వేసుకుని బతుకుతున్నారు. వరదలో కాలనీలన్నీ మునిగినా సాయం చేసేందుకు ఎవరూ రావడం లేదని బాధితులు చెబుతున్నారు. ఇంకో ఇంటికి మారాలన్నా అడ్వాన్స్ లు, సామాన్లు కొనలేమని, జీవనాధారం కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు, దోమలు, చలివల్ల అనారోగ్యం బారిన పడుతున్నామని, ఇప్పటికైనా కనికరించి నీటిని క్లియర్ చేయాలని కోరుతున్నారు.

ఇవన్నీ బురదలోనే

నాగోల్ లోని అయ్యప్ప కాలనీ, మల్లికార్జున నగర్, త్యాగరాయనగర్ కాలనీ, బండ్లగూడ, మె ట్టుగూడ, ఎల్బీనగర్, పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీలోని హనుమాన్ నగర్ కాలనీ, మీర్ పేట్ లోని మిథులానగర్, సత్యనారాయణ నగర్, చాంద్రయాణగుట్ట, ఉప్పల్, ఫలక్ నుమా లోని అల్ జుబైల్ కాలనీ, సయ్యద్ బాబా నగర్, టోలిచౌకి, నదీంకాలనీ, షేక్ పేట్ లోని అక్బర్ పుర కాలనీ, షేక్ పేట్ నాలా మహాత్మా గాంధీ నగర్ తదితర ప్రాంతాలు ఇప్పటికీ వరదనీరు, దానితాలూకు బురద, చెత్తలోనే ఉన్నాయి. ఈ ప్రాంతాలకు చుట్టు పక్కల చెరువులు, నాలాలు ఉండటం, వర్షానికి చెరువులు తెగి నాలాలు పొంగి నీరంతా కాలనీల్లోకి చేరింది. నీరు వచ్చేందుకు 100 దారులుంటే పోయేందుకు 2, 3 దారులే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఇంకా క్లీన్ చేసుకుంటూ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో చాలా చోట్ల పేరుకున్న బురదను స్థానికులు క్లీన్ చేసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ద్వారా జేసీబీలు పంపి చెత్త, బురద తీయిస్తున్నామంటున్నా ఎక్కడా పనులు జరుగుతున్నట్లు కనిపించట్లేదు. స్థానికులు, ఎన్జీవోలు జేసీబీలు, ట్రాక్టర్లు తెప్పించుకుని క్లీన్ చేయించుకుంటున్నారు. ఇంట్లోని సామానంతా పోయి, అడుగుల లోతు నీరు, పేరుకుపోయిన బురదతో బస్తీలు, కాలనీలు దర్శనమిస్తున్నాయి.

రాత్రయితే నరకం

చిన్న వ్యాపారం పెట్టుకుందామని 50 వేలు పెట్టి చీరలు తెచ్చా. ఇంటి నిండా నీళ్లొచ్చి అన్నీ పాడైపోయాయి. జీవనాధారమైన వెహికల్ కూడా చెడిపోయింది. చాలా లాస్ అయిపోయాం. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్లని పట్టుకుని ఎక్కడికి పోలేం. రాత్రయితే నరకం చూస్తున్నాం. రోజుకో పాము వస్తోంది. పడుకోవాలంటే భయమేసి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. నీరుపోతే కనీసం కూలో నాలో చేసుకుని బతుకుతాం.

– మమత, హనుమాన్ నగర్ కాలనీ

జీహెచ్ఎంసీ సిబ్బంది వస్తలే

అయ్యప్ప కాలనీలో 300 పైగా ఫ్యామిలీలు ఉన్నాయి. భారీ వర్షం కురిసిన రోజు వరదల్లో ఒకరు చనిపోయారు. కొన్ని రోజుల కిందట మురుగు నీటి వాసన భరించలేక ఇద్దరు చనిపోయారు. ఐదు రోజుల క్రితం మోటార్ల ద్వారా నీటిని తోడారు. జేసీబీతో చెత్త తీయాలి. జీహెచ్ఎంసీ సిబ్బంది ఒక రోజు వచ్చి ఇంకోరోజు రావడంలేదు. తూములో నుంచి వాటర్ వెళ్తున్నాయి. కానీ ఇంకో లైన్ జామ్ అయింది.

– సతీష్, నాగోల్

నెల రోజుల నుంచి ఇంట్లనే మురుగు నీళ్లు. ఇంట్ల ఉండలేక డాబాపై డేరా వేసుకొని బతుకుతున్నం. చిన్న పిల్లలు సలికి ఆగమైతున్నరు. ఎటన్నా పోయి ఏమన్నా కొని తెచ్చుకోవాలన్నా పిల్లల్ని సంకలేసుకొని గోడల మీద ఎక్కిదుంకుకుంట పోవాలె. మురుగు కంపుతో రాత్రి నిద్ర పట్టది. పానం పాడై
సచ్చెటట్లున్నం. బతికుండంగనే నరకం చూస్తున్నం. తినడానికి తిండి లేదు. తాగనీకి నీళ్లు లేవు. మా బాధ ఏ సారుకీ పడ్తలేదు.

– హైదరాబాద్​ హనుమాన్‌ నగర్​లో ఓ మహిళ ఆవేదన

For More News..

డిసెంబర్‌ మొదటి వారంలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్

దుబ్బాక ఓటమితో జీహెచ్ఎంసీ ఎన్నికలకు తొందరపడుతున్న టీఆర్ఎస్

సర్కారు నిర్ణయాలతో గందరగోళం.. మొట్టికాయలు వేసిన హైకోర్టు