ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేని ఊరు.. కారణమేంటంటే?

ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా  లేని ఊరు.. కారణమేంటంటే?

సెకండ్ వేవ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.  పల్లె, పట్నం తేడా లేకుండా అన్నిచోట్లా కేసులు పెరిగిపోతున్నాయి.  అయితే మన దేశంలో ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా రికార్డ్‌ కాని ఊరు ఒకటి ఉంది.  అది గుజరాత్‌లోని షియాల్ బేట్ గ్రామం.

గుజరాత్‌లో ఇప్పుడు రోజూ పది వేలకు పైనే కొత్త కరోనా కేసులు వస్తున్నాయి.  కానీ,  అమ్రెలీ జిల్లా షియాల్‌ బేట్ పల్లెలో ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.  అందుకు కారణం.. ఈ ఊరు సముద్రం మధ్యలో ఉండడం.  అరేబియా సముద్రం మధ్యలో ఉన్న పల్లె దీవి షియాల్ బేట్‌.  దాదాపు 900 ఇళ్లు ఉన్న ఈ ఊరి జనాభా ఐదు వేలకు పైనే.  ఈ ఊరిలో జాలరి కుటుంబాలు ఎక్కువ.  కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి ఈ ఊరి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. పైగా సముద్రం మధ్యలో ఈ ఊరు ఉండడం వీళ్లకు మరింతగా కలిసొచ్చింది.  రాకపోకలు పెద్దగా లేకపోవడంతో ‘జీరో కేసు’ విలేజ్‌గా నిలిచిందని అధికారులు చెప్తున్నారు. 

లక్షణాలు కూడా.. 
గుజరాత్‌లో బోటు ద్వారా మాత్రమే చేరుకోగలిగే ఏకైక ఊరు షియాల్‌ బేట్‌.  పిపవ్లావ్​ పోర్టు నుంచి బోటు ద్వారా ఈ ఊరికి చేరుకోవచ్చు.  అయితే ఇక్కడి జాలర్లు, అధికారులు ‘ఫాక్స్‌ బ్యాట్ బోట్స్‌’ మాత్రమే ఉపయోగిస్తారు.  ఏడాది గడుస్తున్నా ఇక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని, కనీసం లక్షణాలు కూడా ఎవరిలో కనిపించలేదని మాజీ సర్పంచ్‌ హమీర్‌బాయ్‌ షియాల్‌ చెబుతున్నాడు. సెకండ్ వేవ్‌ నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ఊరి నుంచి ఎవరూ బయటకు వెళ్లొద్దని ఈమధ్యే గ్రామ పంచాయతీ తీర్మానం కూడా చేసింది.  అయితే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మాత్రం ఇక్కడ నడుస్తోంది. ఇప్పటిదాకా ఐదువందల మందికి వ్యాక్సిన్‌లు ఇచ్చారు.

అన్నీఆలస్యమే!
కరోనా అంటని పల్లెగా గుర్తింపు దక్కించుకున్న షియాల్‌ బేట్‌..  ఇంతకు ముందు ఎన్నికల టైంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. చేపల వేటకు సెలవు ప్రకటించుకుని మరీ ఊరి ప్రజలంతా ఓట్లేయడం విశేషం(100% ఓటింగ్‌).  అయితే ఈ ఊరికి కరెంట్ సరఫరా చాలా ఆలస్యంగా(2016)లో మొదలైంది. అలాగే మంచి నీటిని(నర్మదా నది) సముద్రంలో అండర్‌ లైన్‌ పైపుల ద్వారా 2018 నుంచి అందిస్తున్నారు. ఇక్కడి జనాలు లాక్‌డౌన్‌కి ముందు దాకా 12 కిలోమీటర్ల దూరం జఫ్రాబాద్ మండల కేంద్రానికి బోటులో వెళ్లి రేషన్‌ సరుకులు తెచ్చుకునేవాళ్లు. ఆ తర్వాత నుంచి సరుకుల్ని బోట్‌ల ద్వారా అధికారులు ఒడ్డు దాకా చేరుస్తుంటే..  ఆ ఊరి ఆటోవాలాలు ఫ్రీగా డోర్‌ డెలివరీ చేస్తున్నారు.