ఇప్పటికీ అసలైన చరిత్ర అర్థం చేసుకోలేదు

ఇప్పటికీ అసలైన చరిత్ర అర్థం చేసుకోలేదు

హృదయ విదారక సంఘటనే 1948లో జరిగిన రజాకార్ల దారుణ పైశాచిక స్వైరవిహారం. అది యావత్ తెలంగాణ ప్రజలందరి గుండెల నుండి అగ్గిరవ్వలు రేపిన దుశ్చర్య!  ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుత్సిత కుతంత్రాలకు తల్లడిల్లిన తరుణం. తెలంగాణ క్షేత్రం రక్తసిక్తమైన వైనం. దాస్య శృంఖలాల నుండి భరతమాత బంధాలు విడిపించినా తెలంగాణ  మాత్రం పరతంత్రం కావడం ప్రపంచాన్నే ఆశ్చర్యపరచింది. అదే దక్కను పీఠభూమి ప్రజలకు భరతమాత ఒడిలో వాలే అవకాశం దక్కినరోజు, ఆ రోజే సెప్టెంబర్ 17, 1948.ఆ రోజే నయవంచకుడు నిజాం నవాబు ఉక్కుమనిషి చెంత మోకరిల్లిన రోజు. అదే తెలంగాణ విమోచనదినం. అప్పటి నుండి ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 17 కు ముందు రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలకు అనుగుణంగా 'తెలంగాణ విమోచన'ను నిర్వచించడం మొదలుపెట్టారు. విమోచన కాదు, విలీనం! సమైక్యం! విద్రోహం! అంటూ కొత్త పదాలను ఉపయోగించి ఈ చరిత్రకున్న గరిమను తగ్గించాలని చూస్తున్నారు. ఇందుకు దీని వెనుకున్నది ఓట్ల రాజకీయమే. క్రీ.శ.1656లో బతుకు దెరువుకోసం ఖులీజ్ ఖాన్ అనే మతోన్మాది టర్కీలోని బోఖరా నుండి భారత్ కు వచ్చాడు. నాటి మొగల్ పాలకుడైన షాజహాన్ కొలువులో చేరి పదవి పొందాడు. అతని మనుమడే ఖుమ్రుద్దీన్. ఈ వ్యక్తే 'నిజాముల్ ముల్కు' అనే బిరుదు పొందాడు. వీళ్ళ వంశం పేరు ఆసఫ్​జాహి. ఆ తర్వాత ఔరంగజేబు పాలనలో దక్కన్ ప్రాంతానికి ‘నిజాముల్ ముల్కు ’ సుబేదారుగా, నియమితుడయ్యాడు. ఔరంగజేబు మరణం తర్వాత 1724లో దక్కన్ కు తనను తాను నవాబుగా స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు.  చివరివాడు, ఏడవవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్.

మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్

కుతుబ్​షాహీల పరిపాలనాంతంలో గొప్ప మేధావులైన అక్కన్న, మాదన్న మంత్రుల హత్యలు జరిగాయి. అప్పటి నుంచే ఈ రాజులు పరమత సహనం కోల్పోయారు. మరీ ముఖ్యంగా 1724  నిజాం పరిపాలన నుంచి ఇది మరీ తీవ్రమై ఏడవ నైజాం కాలం నాటికి ఉధృతంగా కొనసాగింది. 1919లో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన మాంటెంగ్ చెపస్ఫర్డ్ సంస్కరణలను పోలిన సంస్కరణలు నైజాం రాష్ట్రంలో రాజకీయంగా ప్రవేశించాయి. అట్టడుగు స్థాయిలోని ముస్లింలకు ఇది ఎలాంటి మేలు చేయలేదు. 1927లో '-మజ్లిస్ బైనుల్​ఇత్తెహాదుల్’ అనే సంస్థ ఏర్పడింది. 1929లో ఈ పదంలోని 'బైనుల్' అనే పదం పోయింది. 'మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్' గా మారి ఉన్నత ఆశయాలను వదిలిపెట్టింది. 1937లో ఈ సంస్థ మత పరివర్తన ఉద్యమం 'తల్లీగ్' ద్వారా సంస్థానంలోని హరిజనులకు భూములు, ఆర్థిక స్థిరత్వం కల్పిస్తామని ఆశ చూపి మత మార్పిడి చేశారు. బహదూర్ యార్ జంగ్ మరణం తర్వాత కొంత కాలానికి పై సంస్థ అధ్యక్ష పదవి ఖాసీం రజ్వీకి లభించింది. 'రజాకార్' అనే మాటకు 'వాలంటీర్' అని అర్థం. కాని సేవా దృక్పథం ఉండాల్సిన రజాకార్లు, వారి అధ్యక్షుడు పరమత సహనం కోల్పోయారు.

ALSO READ: సైబర్ నేరాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం: డీజీపీ

తిరుగుబాటుతో విమోచనం

ఇలా ఒకవైపు దేశం మొత్తం స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటుంటే ఇక్కడ రజాకార్ల దురాగతాల పరంపర కొనసాగింది. షోయబుల్లాఖాన్ హత్య తర్వాత ప్రజలు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు, రైతులు నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఆర్యసమాజ్ కార్యకర్త నారాయణరావ్ పవార్ నిజాం ప్రయాణిస్తున్న కోచ్​మీద బాంబు విసరగా నిజాం త్రుటిలో తప్పించుకొన్నాడు. ఇక్కడి పెద్దలు కేంద్రానికి వెళ్ళి నెహ్రూను, సర్దార్ పటేల్​ను కలిసి తెలంగాణ పరిస్థితి వివరించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి నేతృత్వంలో భారత సైన్యాన్ని హైదరాబాద్​కు తరలించారు. 1948 సెప్టెంబర్ 13న సైన్యం దిగింది. మూడు రోజులు ఎదిరించిన నిజాం సైన్యం చివరకు చేతులెత్తేసింది. ఎలాంటి రక్తపాతం జరక్కుండానే సెప్టెంబర్ 17న నిజాం తలవంచాడు. 'సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం' పై ఎర్రమబ్బులు కమ్ముకొన్నాయి. ఇటీవల కొందరు కొత్త చరిత్రకారులు పుట్టుకొచ్చి 'ఈ చరిత్రను మత దృష్టితో చూడవద్దంటారు. ఎందుకంటే ఇదంతా భూస్వామ్య, ఫ్యూడల్ వర్గాలకు, పేదలకు జరిగిన పోరాటంగా చూడాలంటారు. మరి ఇందులో మత కోణమే లేదా! అలా అయితే కాంగ్రెస్ కు చెందిన రామానంద తీర్థ దేనికోసం పోరాటం చేశాడు? కమ్యూనిస్టు నాయకులు తమ గ్రామాల్లో మతమార్పిడి అయిన దళితులను పునరాగమనం ఎందుకు చేయించారు?

రుద్దబడిన ఉర్దూ

1917లో తెలుగును నిజాం ప్రభుత్వం నిషేధించి ఉర్దూను 'కల్చరల్ & అఫిషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్' గా ప్రకటించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని లైబ్రరీ పుస్తకాల్లోని ఇస్లాం విరుద్ధ అంశాలను ఫ్యాక్ట్ చెక్ చేసే బోర్డు ఎందుకు నియమించారో ఈ చరిత్రకారులకు తెలియదనుకోవాలా? 1951 లెక్కల ప్రకారం నిజాం రాష్ట్ర జనాభా 1 కోటి 80 లక్షల్లో తెలుగు మాట్లాడేవారు. 50%,  మరాఠీ భాషీయులు 25%, కన్నడ భాషీయులు 11%, ఉర్దూ మాట్లాడేవారు 12% ఉన్నా, జనాభా పరంగా 88% హిందువులే ఉన్నా అధికార భాష ఉర్దూ ఎందుకయ్యిందో చెప్పగలరా! ఇక్కడి ఉద్యోగాలకు ఎంపికయిన వారు 90% మంది ముస్లింలే కదా!అంత మతసహనం ఉంటే ఇక్కడ జాతీయ జెండా ఎగురవేసినందుకు పరకాల, అప్పంపల్లి లాంటి దుర్ఘటనలు ఎందుకు జరిగాయి? జెండా ఎగురవేసిన బత్తిని మొగిలయ్య గౌడ్ ఎందుకు హత్యకు గురయ్యాడు? అందుకే నరకాసురుడి లాంటి నిజాం, రక్తబీజుడిలాంటి రజాకార్ నాయకుడు ఖాసీంరజ్వీలను 'మరో అక్బర్' పాదుషాలను చేసి, వారి పాదాలను శిరస్సులపై దాల్చాలనే వైఖరిలో మార్పు కోసమే ఈ ప్రయత్నం. 'నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల ముగింపు' సందర్భంగా తెలంగాణ ప్రజలమైన మనం సరైన చరిత్రను సమాజం ముందు పెట్టి న్యాయం కోరుకుందాం!

‑ డా. పి. భాస్కరయోగి,
సోషల్​ ఎనలిస్ట్​