- గత నెల 30న టెన్త్ ఫలితాలు విడుదల
- ఇప్పటికీ అడ్మిషన్ నోటిఫికేషన్ రాలే
- ఎదురుచూపుల్లో మెరిట్ స్టూడెంట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేఈ– బాసర ట్రిపుల్ ఐటీ) లో అడ్మిషన్ల కోసం టెన్త్ పాసైన మెరిట్ స్టూడెంట్లకు ఎదురుచూపులు తప్పడం లేదు. పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలై సుమారు మూడు వారాలైనా.. ఇప్పటికీ ఆర్జీయూకేజీ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. దీంతో మెరిట్ స్టూడెంట్లలో అయోమయం నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత మెరిట్ విద్యార్థులకు నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు 2008లో అప్పటి సీఎం దివంగత రాజశేఖర్ రెడ్డి.. బాసరలో ఆర్జీయూకేటీని ఏర్పాటు చేశారు.
దీంట్లో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో అడ్మిషన్ పొందితే రెండేండ్లు పీయూసీ (ఇంటర్) తో పాటు నాలుగేండ్ల ఇంజినీరింగ్ కోర్సు చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏటా 1500 సీట్లు భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ అయింది. మరోపక్క కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలన్నీ అడ్మిషన్ల కోసం పేరెంట్స్, స్టూడెంట్స్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఆర్జీయూకేటీలో సీట్లు పొందే వారంతా దాదాపు మెరిట్ స్టూడెంట్లే ఉంటారు. టెన్త్ లో10 జీపీఏ వచ్చిన వారే ఎక్కువగా ఉంటారు. ఫీజు తక్కువ చేస్తామంటూ వీరందరికీ ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్లు ఇచ్చే అవకాశం ఉంది.
ఈ క్రమంలో సాధ్యమైనంత త్వరగా ఆర్జీయూకేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇస్తే.. మెరిట్ స్టూడెంట్లు ఇటు వైపు వచ్చే చాన్స్ ఉంది. కాగా, సకాలంలో అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తేనే.. 2024–25 విద్యా సంవత్సరం సజావుగా నిర్వహించవచ్చు. లేకపోతే అకాడమిక్ ఇయర్ కూడా ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. కాగా, రాష్ట్రంలో బాసర ట్రిపుల్ ఐటీతో పాటు మరో రెండు ఆఫ్ క్యాంపస్లు పెట్టాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. వాటిలో ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభిస్తే.. ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా త్వరగా ఆర్జీయూకేటీ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేయాలని పేరెంట్స్, స్టూడెంట్లు కోరుతున్నారు.