కంపుకొడ్తున్న గాంధీ మార్చురీ..

కంపుకొడ్తున్న గాంధీ మార్చురీ..
  • ఫ్రీజర్లు పాడై డీకంపోజ్ అవుతున్న శవాలు 
  • నెల రోజులుగా ఇదే దుస్థితి 
  • డాక్టర్లు, పేషెంట్లు, అటెండర్ల అవస్థలు   

హైదరాబాద్, వెలుగు: గాంధీ దవాఖాన మార్చురీ పరిసరాలు కంపు కొడుతున్నయి. మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తుల డెడ్ బాడీలను భద్రపరిచే పఫ్‌‌ రూమ్‌‌ పాడైపోయింది. అందులో ఏసీలు పని చేయడం లేదు. జీహెచ్‌‌ఎంసీ సిబ్బంది వచ్చి తీసుకెళ్లే వరకూ అన్‌‌ఐడెంటిఫైడ్ డెడ్‌‌ బాడీస్‌‌ను మార్చురీలోని పఫ్‌‌ రూమ్‌‌లోనే ఉంచుతారు. 

వారానికోసారి లేదా పది రోజులకు ఒకసారి జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ సిబ్బంది ఈ మృతదేహాలన్నింటినీ తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తారు. అయితే, పాడైపోయిన పఫ్ రూమ్ లో రోజుల తరబడి ఉండడంతో మృతదేహాలు డీకంపోజ్ అయ్యి కంపుకొడుతున్నయి. మార్చురీలో పనిచేసే డాక్టర్లు, సిబ్బంది, పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టమ్‌‌‌‌‌‌‌‌ కోసం వేచి చూస్తున్న మృతుల కుటుంబ సభ్యులు దుర్వాసన భరించలేక అవస్థలు పడుతున్నారు. మార్చురీ పరిసరాల్లోకీ వాసన వ్యాపిస్తుండటంతో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం వచ్చిన పేషెంట్లు, వారి అటెండర్లు సైతం ఇబ్బంది పడుతున్నారు. అలాగే డీకంపోజ్ అయిన బాడీస్‌‌‌‌‌‌‌‌ను తీసుకెళ్లి ఖననం చేయడానికి జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ సిబ్బంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు.   

18 ఫ్రీజర్ బాక్సులు రిపేర్  

మార్చురీలో పఫ్ రూమ్ తో పాటు ఫ్రీజర్లు కూడా రిపేర్ కు వచ్చాయి. ఇక్కడ మొత్తం 60 ఫ్రీజర్ బాక్స్‌‌‌‌‌‌‌‌లు ఉండగా, 42 మాత్రమే పనిచేస్తున్నాయి. ఇంకో 18 బాక్సులు రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. డెడ్‌‌‌‌‌‌‌‌ బాడీస్‌‌‌‌‌‌‌‌ తక్కువగా వచ్చినప్పుడు ఇబ్బంది లేనప్పటికీ, ఎక్కువైతే పాడయిపోయిన ఫ్రీజర్లలోనే భద్రపరుస్తున్నారు. ఇలా చేయడం వల్ల మృతదేహాలు డీకంపోజ్ అయ్యి, ఖననం చేయడానికి కుటుంబ సభ్యులకు ఇబ్బంది అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఫ్రీజర్లు, పఫ్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌ను రిపేర్ చేయించాలని నెల రోజుల నుంచి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ను కోరుతున్నా పట్టించుకోవడం లేదని డాక్టర్లు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వారం రోజుల్లో బాగుచేయిస్తం 

పఫ్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌ ఏసీలు, కొన్ని ఫ్రీజర్ బాక్సులు పనిచేయని మాట వాస్తవమే. మార్చురీలోకి వెళ్లి పనిచేయడానికి చాలా మంది ఇష్టపడరు. దీనివల్ల మెయింటెనెన్స్ కష్టమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే రిపేర్ల బాధ్యతలను ఓ వ్యక్తికి అప్పగించి, ఆయనతోనే కాంట్రాక్ట్ చేసుకున్నాం. ఆ వ్యక్తి అందుబాటులో లేకపోవడం వల్ల, రిపేర్ చేయించడం వీలు పడలేదు. ఒక వారం రోజుల్లో రిపేర్లు పూర్తి చేసి, ఇబ్బంది లేకుండా చూస్తాం. 


- డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌, గాంధీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌