గోదావరిఖని, వెలుగు: రిటైర్డ్ టీచర్ నుంచి సబ్ ట్రెజరీ ఆఫీసర్(ఎస్టీవో) ఏకుల మహేశ్వర్, అతని సబార్టినేట్ రెడ్డవేణి పవన్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వీవీ రమణమూర్తి, సీఐ కృష్ణ కుమార్ తెలిపిన ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణానికి చెందిన కన్నూరి ఆనందరావు గవర్నమెంట్ టీచర్‌గా పని చేసి 2024 జూన్ 30న రిటైర్‌అయ్యారు.
తనకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలతో పాటు పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే పెన్షన్ మంజూరు కావాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని ఎస్టీవో మహేశ్వర్ డిమాండ్ చేశాడు. దీనిపై రిటైర్డ్ టీచర్ ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు గురువారం ఎస్టీవో ఆఫీస్‌లో రూ.10 వేలు ఇవ్వగా, ఎస్టీవో మహేశ్వర్‌తో పాటు ఆఫీస్ సబార్టినేట్ పవన్‌ను పట్టుకున్నారు.