అమ్మకాలతో మార్కెట్లు కుదేల్.. రెండు రోజుల లాభాలకు బ్రేక్..

అమ్మకాలతో మార్కెట్లు కుదేల్.. రెండు రోజుల లాభాలకు బ్రేక్..
  • సెన్సెక్స్​ 720 పాయింట్లు డౌన్..​
  • 183 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఐటీ సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా ఈక్విటీ  బెంచ్​మార్క్​ సూచీలు శుక్రవారం దాదాపు ఒకశాతం వరకు నష్టపోయాయి. రూపాయి విలువ కూడా మరింత దిగజారడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్​ దెబ్బతిన్నది. దీంతో సెన్సెక్స్​720.60 పాయింట్లు నష్టపోయి 79,223.11 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 833.98 పాయింట్లు తగ్గి 79,109.73 పాయింట్లకు చేరింది. 

ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 183.90 పాయింట్లు కోల్పోయి 24,004.75 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈవారంలో సెన్సెక్స్​ 524.04 పాయింట్లు, నిఫ్టీ 191.35 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్​ ఫోకస్​ అంతా వచ్చే వారం నుంచే రిజల్ట్స్​పై ఉందని జియోజిత్​  ఫైనాన్షియల్ ​సర్వీసెస్​  రీసెర్చ్​ హెడ్ ​వినోద్​ నాయర్​ చెప్పారు. సెన్సెక్స్​ ప్యాక్​  నుంచి  జొమాటో, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టెక్​ మహీంద్రా, అదానీ పోర్ట్స్​, టీసీఎస్​, ఐసీఐసీఐ బ్యాంక్​, సన్​ఫార్మా, ఎల్​అండ్​ టీ, హెచ్​సీఎల్​, ఐటీసీ నష్టపోయాయి. టాటా మోటార్స్, నెస్లే, టైటాన్​, హెచ్​యూఎల్​, రిలయన్స్​షేర్లు లాభపడ్డాయి. 

మార్కెట్​గత రెండు సెషన్లలో లాభపడ్డప్పటికీ.. వృద్ధి నెమ్మదించడం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, అమెరికా వాణిజ్య విధానాలపై అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లలో నిరాశ కనిపిస్తోందని మెహతా ఈక్విటీస్​ఎనలిస్ట్​ ప్రశాంత్​తాప్సీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, బీఎస్​ఈ మిడ్​క్యాప్​ 0.33 శాతం, స్మాల్​క్యాప్​ 0.02 శాతం నష్టపోయాయి.

 బీఎస్​ఈ సెక్టోరల్ ​ఇండెక్స్​లలో ఎనర్జీ, టెలికం, కన్జూమర్ ​ డ్యూరబుల్స్​, మెటల్,​ఆయిల్​అండ్ ​గ్యాస్ ​లాభపడ్డాయి. మూడో క్వార్టర్ ​ఫలితాలు మెప్పించడంతో డీమార్ట్​ షేరు 11 శాతం లాభపడింది. ఆసియా మార్కెట్లలో సియోల్​, హాంకాంగ్​లాభాల్లో, షాంఘై నష్టాల్లో ముగిశాయి. కొత్త సంవత్సరం సెలవు వల్ల జపాన్​ మార్కెట్లు పనిచేయలేదు. ఎఫ్​ఐఐలు గురువారం 1,506.75 కోట్ల విలువైన ఈక్విటీలు కొన్నారు. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ నాలుగు పైసలు తగ్గి 85.79 (తాత్కాలికం) వద్ద ముగిసింది.  బ్రెంట్ ​క్రూడ్  ​బ్యారెల్​ ధర 0.43 శాతం తగ్గి 75.60 డాలర్లకు చేరింది.