
ముంబై: ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌ను యూఎస్, ఇండియా ఇన్‌ఫ్లేషన్ నెంబర్లు ప్రభావితం చేయనున్నాయి. ఈ నెల 12న ఈ దేశాల కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) డేటా విడుదల కానుంది. దీంతో పాటు యూఎస్ టారిఫ్ వార్తలు, విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐల) ట్రెండ్, డాలర్ మారకంలో రూపాయి కదలికలు, క్రూడాయిల్ ధరపై ట్రేడర్లు ఫోకస్ పెట్టాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. హోలి సందర్భంగా శుక్రవారం మార్కెట్‌కు సెలవు.
కిందటి వారం సెన్సెక్స్ 1,134 పాయింట్లు (1.55 శాతం), నిఫ్టీ 428 పాయింట్లు (1.93 శాతం) లాభపడ్డాయి. ప్రస్తుతం మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ కొనసాగుతోంది. కిందటివారం బుధ, గురువారం సెషన్లలో నిఫ్టీ రెండు శాతానికి పైగా లాభపడింది. ఈ వారం కూడా రిలీఫ్ ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. కెనడా, మెక్సికోపై వేయనున్న టారిఫ్‌లను నెల పాటు యూఎస్ ప్రభుత్వం వాయిదా వేసింది. ట్రంప్ టారిఫ్‌లపై వెనక్కి తగ్గుతున్నారనే అంచనాలు పెరిగాయి. దీంతో గ్లోబల్ మార్కెట్‌లు సానుకూలంగా కదులుతున్నాయి. దీంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచడానికి ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటోంది. వీటి ప్రభావం గత రెండు సెషన్లుగా మార్కెట్‌లో కనిపించింది.
ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలోని మొదటి వారంలో నికరంగా రూ.24,753 కోట్లను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు. ట్రేడ్ వార్ ముదురుతుండడం, ఇండియన్ కంపెనీల రిజల్ట్స్ మెప్పించకపోవడంతో గత ఐదు నెలల నుంచి నికర అమ్మకందారులుగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నికరంగా రూ.34,574 కోట్లను, జనవరిలో రూ.78,027 కోట్లను మార్కెట్ నుంచి విత్‌డ్రా చేసుకున్నారు.