మార్కెట్లలో జోష్ .. స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజులు లాభాల్లోనే.. కారణాలు ఇవే..

మార్కెట్లలో జోష్ .. స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజులు లాభాల్లోనే.. కారణాలు ఇవే..

ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజైన గురువారం లాభాల్లో కదిలాయి. బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్ 899.01 పాయింట్లు పెరిగి 76,348.06 వద్ద స్థిరపడింది. తిరిగి 76 వేల స్థాయిని అందుకుంది. ఇంట్రాడేలో గరిష్ఠంగా 1,007.2 పాయింట్లు పెరిగి 76,456.25కి చేరుకుంది. ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ నిఫ్టీ 283.05 పాయింట్లు ఎగసి 23,190.65 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో  23,217 లెవెల్ వరకు వెళ్లింది. 

గత నాలుగు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.17.43 లక్షల కోట్లు పెరిగింది. గురువారం ఒక్క రోజే రూ.మూడు లక్షలు పెరిగింది. బీఎస్​ఈ లిస్టెడ్​ కంపెనీ మార్కెట్​క్యాప్​ విలువ రూ.408 లక్షల కోట్లకు ఎగసింది.  ఆటో, బ్యాంక్, మెటల్, పవర్, ఫార్మా రంగాలు 0.5-–1.5శాతం పెరిగాయి. బీఎస్‌‌‌‌ఈ మిడ్‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.7శాతం లాభపడగా, స్మాల్‌‌‌‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌‌‌‌గా ముగిసింది.

రియల్ ఎస్టేట్, మీడియా రంగాలు 0.5శాతం చొప్పున నష్టపోయాయి. ఐటీ,  ఎఫ్‌‌‌‌ఎంసీజీ రంగాలు కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. - ఆసియా మార్కెట్లలో, సియోల్ సానుకూలంగా స్థిరపడగా, షాంఘై, హాంకాంగ్ నష్టాలతో ముగిశాయి. సెలవు కారణంగా జపాన్ నిక్కీ ఓపెన్‌‌ కాలేదు. యూరోపియన్ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో కదిలాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.32 శాతం పెరిగి బ్యారెల్‌‌‌‌కు 71.01 డాలర్లకు చేరుకుంది. ఎఫ్​ఐఐలు బుధవారం రూ.1,096.50 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మగా, డీఐఐలు రూ.2,140.76 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.

లాభాలకు కారణాలు:
1. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లను 4.25-–4.50శాతం పరిధిలో యదాతథంగా ఉంచినట్లు ప్రకటించడం, 2025లో రెండు సార్లు రేట్లను తగ్గిస్తామని సంకేతాలు ఇవ్వడంతో  మార్కెట్లు లాభాల్లో  కదిలాయి.
2. హెవీ వెయిట్లలో కొనుగోళ్లు: రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్‌‌‌‌టెల్, టైటాన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హిందుస్తాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, నెస్లే, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్, టాటా మోటార్స్ వంటి మార్కెట్ హెవీవెయిట్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి. భారతి ఎయిర్‌‌‌‌టెల్ (4.08శాతం) గురువారం నిఫ్టీ 50లో అత్యధిక లాభం సాధించిన షేరుగా నిలిచింది.
3. సెక్టోరల్ సూచీల పనితీరు: బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఐటీ,  కన్జూమర్ గూడ్స్ రంగాలు ఈ ర్యాలీకి ప్రధాన ఊతమిచ్చాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.57శాతం పెరిగింది. పర్సిస్టెంట్ సిస్టమ్స్ మినహా అన్ని ఐటీ షేర్లు లాభపడ్డాయి. మెటల్, పవర్,  పీఎస్‌‌‌‌యూ బ్యాంక్ ఇండెక్స్‌‌లు 1-–2.8శాతం వరకు పెరిగాయి.