- సెన్సెక్స్ 809 పాయింట్లు అప్
- 240 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
ముంబై: వరుసగా ఐదో రోజూ మార్కెట్లు పెరిగాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో బీఎస్ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 809.53 పాయింట్లు పెరిగి 81,765.86 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 1,361.41 పాయింట్లు ఎగిసి 82,317.74 వద్దకు చేరుకుంది. అయితే ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో ప్రీ-క్లోజ్ సెషన్‌లో లాభాలు తగ్గాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 240.95 పాయింట్లు పెరిగి 24,708.40కి చేరుకుంది.
ఐటీ స్టాక్‌లలో కొనుగోళ్లు, యూఎస్ మార్కెట్లలో ర్యాలీ కారణంగా బెంచ్‌మార్క్ సూచీలు దూసుకెళ్లాయి. ఈ ఐదు రోజుల్లో సెన్సెక్స్2,700 పాయింట్లు ఎగిసింది. సెన్సెక్స్ ప్యాక్ నుంచి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టైటాన్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్, టెక్నాలజీస్ , టెక్ మహీంద్రా లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ, ఏషియన్ పెయింట్స్ వెనకబడ్డాయి. డౌ మొదటిసారిగా 45 వేల మార్కును దాటడం, యూఎస్‌లో ద్రవ్యోల్బణం తగ్గడం కూడా ఈ ర్యాలీకి కారణమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ అన్నారు. బీఎస్ఈ మిడ్‌క్యాప్ గేజ్ 0.27 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.16 శాతం పెరిగాయి. బీఎస్ఈలో 2,141 స్టాక్‌లు పురోగమించగా, 1,825 నష్టపోయాయి.
ఇండెక్స్‌లు ఇలా..
సెక్టోరల్ ఇండెక్స్‌లలో, బీఎస్ఈ ఐటీ అత్యధికంగా 1.96 శాతం ఎగబాకగా, టెక్ 1.92 శాతం, ఐటి 1.81 శాతం టెలికమ్యూనికేషన్ 0.95 శాతం పెరిగింది. బ్యాంకెక్స్ 0.68 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.66 శాతం కూడా పురోగమించాయి. సేవలు, రియల్టీ వెనుకబడి ఉన్నాయి. ఎఫ్‌ఐఐలు భారీగా కొనుగోళ్లు జరపడం వల్ల లార్జ్ క్యాప్‌లకు సానుకూలంగా మారిందని విశ్లేషకులు తెలిపారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) బుధవారం రూ. 1,797.60 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఇదిలా ఉంటే, గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ శుక్రవారం తన పాలసీ సమీక్షను ప్రకటించనుంది. ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై లాభాల్లో స్థిరపడగా, సియోల్, హాంకాంగ్ నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బుధవారం అమెరికా మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.53 శాతం పెరిగి 72.68 డాలర్లకు చేరుకుంది.
గత ఐదు రోజుల మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ. 15.18 లక్షల కోట్లు పెరిగింది. ఈకాలంలో బీఎస్ఈ సెన్సెక్స్ 2,722.12 పాయింట్లు లేదా 3.44 శాతం పెరిగింది. బీఎస్ఈ -లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత ఐదు సెషన్లలో రూ.15,18,926.69 కోట్లు పెరిగి రూ.458 లక్షల కోట్లకు ( 5.41 ట్రిలియన్ డాలర్లు) చేరుకుంది.