
ముంబై: ఆర్‌బీఐ వడ్డీ రేట్ల నిర్ణయం, యూఎస్ ఇన్‌ఫ్లేషన్ డేటా వంటి కీలకమైన అంశాలు ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌ను నిర్ణయించనున్నాయి. ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం గ్లోబల్ ఎకానమీపై ఎలా ఉంటుందో ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. చైనా కూడా యూఎస్‌పై 34 శాతం టారిఫ్ వేయడంతో శుక్రవారం సెషన్‌లో గ్లోబల్ మార్కెట్లు భారీగా పడ్డాయి. దీనికి మన మార్కెట్లు సోమవారం స్పందించనున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ సుమారు 3 శాతం పతనమవ్వడంతో సోమవారం నిఫ్టీ 3 శాతం లాస్‌తో ఓపెన్ అవుతుందని ఎనలిస్టులు భావిస్తున్నారు.
యూఎస్ ఇన్‌ఫ్లేషన్ డేటా ఈ నెల 10న వెలువడనుండగా, ఫెడ్ మినిట్స్ 9న విడుదల కానున్నాయని, ట్రేడర్లు వీటిపై దృష్టి పెడతారని ఎనలిస్టులు పేర్కొన్నారు. దేశీయంగా చూస్తే ఆర్‌బీఐ వడ్డీ రేట్ల నిర్ణయం ఈ నెల 9న వెలువడనుంది. మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారనే అంచనాలు ఉన్నాయి. టీసీఎస్ క్యూ4 రిజల్ట్స్ ఈ నెల 10న వెలువడనున్నాయి. మహావీర్ జయంతి సందర్భంగా ఈ నెల 10న మార్కెట్‌కు సెలవు.