- సెన్సెక్స్ 2,222, నిఫ్టీ 660 పాయింట్లు డౌన్
- భయపెట్టిన అమెరికా ఆర్థికమాంద్యం వార్తలు, జపాన్ రేట్ హైక్ నిర్ణయాలు
- ఎఫెక్ట్ చూపిన ఇజ్రాయెల్– ఇరాన్ ఘర్షణ వాతావరణం
- గ్లోబల్ మార్కెట్లలోనూ భారీ పతనాలు
- నిఫ్టీ 2.5 శాతానికి పైగా క్రాష్
- ఐటీ, మెటల్, బ్యాంక్ షేర్లు ఢమాల్
- రూ.15 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు
ఇన్వెస్టర్లకు స్టాక్‌మార్కెట్లు చుక్కలు చూపించాయి. రక్తకన్నీరు తెప్పించాయి. రెండు రోజుల హాలిడేస్ తర్వాత తిరిగి సోమవారం ఓపెన్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు సహా దాదాపు అన్ని సెక్టార్ల స్టాక్స్ భారీగా క్రాష్ అయ్యాయి. ఒక్కరోజులోనే రూ. 15 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్లకు మండే.. బ్లాక్ మండేగా మిగిలింది.
అమెరికాను ఆర్థిక మాంద్యం చుట్టుముడుతున్నదన్న వార్తలు, జపాన్ తీసుకున్న రేట్ హైక్ నిర్ణయాలు, ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధవాతావరణం మార్కెట్‌ను షేక్ చేసింది. నిఫ్టీ ఏకంగా రెండున్నర శాతానికి పైగా పతనమైంది. 660 పాయింట్లు నష్టంతో ముగిసింది. ఇంట్రాడేలో ఒక దశలో నిఫ్టీ ఇండెక్స్ 23,900 దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 2,222 (2.74శాతం) పాయింట్లు క్రాష్ అయింది.
మన స్టాక్ మార్కెట్లు మాత్రమే కాదు గ్లోబల్ మార్కెట్లన్నీ సోమవారం భారీ నష్టాలు చవిచూశాయి. జపాన్ నికాయ్ 13 శాతం పతనమవ్వగా, సౌత్ కొరియా కొస్పీ 9 శాతం నష్టపోయింది. షాంఘై, చైనా మార్కెట్లు 1.50 శాతం వరకు పడ్డాయి. యూరోపియన్ మార్కెట్లూ ఇదే బాటలో ట్రేడయ్యాయి. యూఎస్ డౌజోన్స్, నాస్‌డాక్, ఎస్ అండ్ పీ ఇండెక్స్‌లు 3 శాతం వరకు నష్టపోయాయి.
ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం కుదేలయ్యాయి. యూఎస్ ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా మారడంతో గ్లోబల్ మార్కెట్లు పతనమవుతున్నాయి. ఈ ప్రభావం ఇండియన్ మార్కెట్లపై కూడా పడుతోంది. ముఖ్యంగా టెక్, ఐటీ షేర్ల పతనం బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లను సోమవారం కుదిపేసింది. బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు కూడా పడడంతో నిఫ్టీ బడ్జెట్ రోజు కనిష్టమైన 24,070 లెవెల్ కిందకు పడింది.
చివరి గంటలో కొనుగోళ్లు పెరగడంతో ఇంట్రాడే నష్టాల నుంచి కోలుకొని, 24 వేల పైన ముగిసింది. నిఫ్టీ సోమవారం 662 పాయింట్లు (2.68 శాతం) పతనమై 24,056 దగ్గర సెటిలయ్యింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 824 పాయింట్లు తగ్గి 23,894 వరకు పడింది. ఈ ఏడాది జూన్ 4 తర్వాత నిఫ్టీకి ఇదే అతిపెద్ద సింగిల్‌డే లాస్. అప్పుడు జనరల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ సందర్భంగా ఈ బెంచ్‌మార్క్ ఇండెక్స్ 5 శాతం క్రాష్ అయ్యింది.
సెన్సెక్స్ కూడా సోమవారం 2,223 పాయింట్లు పతనమై 78,759 దగ్గర ముగిసింది ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 2,686 పాయింట్లు తగ్గి 78,296 వరకు పడింది. నిఫ్టీ, సెన్సెక్స్ శుక్రవారం సెషన్‌లో ఒక శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్‌లో టాటా మోటార్స్ షేర్లు సోమవారం 7 శాతానికి పైగా క్రాష్ అయ్యాయి. అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతి షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మరోవైపు హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే లాభాల్లో క్లోజయ్యాయి. ఇన్వెస్టర్లు సోమవారం రూ.15 లక్షల కోట్లు నష్టపోయారు. బీఎస్‌ఈలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్
రూ.441.84 లక్షల కోట్లకు తగ్గింది.
గత రెండు సెషన్లలోనే ఇన్వెస్టర్లు రూ.19 లక్షల కోట్లు కోల్పోయారు. బ్రాడ్ మార్కెట్ చూస్తే బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 4.21 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3.60 శాతం పతనమయ్యాయి. సెక్టార్ల పరంగా చూస్తే, నిఫ్టీ మెటల్ 4.85 శాతం, ఆటో 3.92 శాతం, ఐటీ 3.26 శాతం, రియల్టీ 4.32 శాతం నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్ 2.45 శాతం తగ్గింది. ఎన్‌ఎస్‌ఈలోని మొత్తం 3,414 షేర్లు సోమవారం నష్టాల్లో క్లోజయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 35 పైసలు బలహీనపడి 83.8075 వద్ద సెటిలయ్యింది. ఇన్వెస్టర్ల భయాన్ని కొలిచే నిఫ్టీ విక్స్ ఇండెక్స్ సోమవారం 60 శాతం పెరిగి 23 లెవెల్‌ను టచ్ చేసింది. చివరికి 42 శాతం లాభంతో 20 .37 దగ్గర ముగిసింది.