రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్లు.. 81వేల మార్క్ దాటిన సెన్సెక్స్

రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్లు.. 81వేల మార్క్ దాటిన సెన్సెక్స్
  • 24,800 వద్ద ముగిసిన నిఫ్టీ
  • 188 పాయింట్లు పెరిగి ఆల్​టైం హైకి

ముంబై : స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా నాలుగో రోజూ రికార్డు స్థాయిలో ముగిశాయి. ఐటీ, ఆయిల్, గ్యాస్, ఎఫ్​ఎంసీజీ షేర్లలో కొనుగోళ్ల వల్ల నిఫ్టీ రికార్డు స్థాయిలో 24,800 స్థాయికి చేరుకుంది. ప్రారంభ కనిష్ట స్థాయిల నుంచి పుంజుకున్న 30 షేర్ల బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ సెన్సెక్స్ 626.91 పాయింట్లు పెరిగి తాజా ముగింపు గరిష్ట స్థాయి 81,343.46 వద్ద స్థిరపడింది. సూచీ బలహీనంగా ప్రారంభమై ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 80,390.37 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది.   

టీసీఎస్, ఇన్ఫోసిస్,  టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్​లో ర్యాలీ వల్ల  మధ్యాహ్నం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండెక్స్ నష్టాలు తగ్గాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్​ 806 పాయింట్లు పెరిగి ఆల్‌‌‌‌టైం హై 81,522.55ను తాకింది.  నిఫ్టీ కూడా ప్రారంభ నష్టాలను తగ్గించుకుంది. ఇది 188 పాయింట్లు పెరిగి ఆల్-టైం ముగింపు గరిష్ట స్థాయి 24,800.85 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో  224.75 పాయింట్లు జూమ్ చేసి 24,837.75 వద్ద తాజా జీవితకాల గరిష్టాన్ని తాకింది. 

ఐటీ స్టాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ర్యాలీ, ప్రముఖ ఐటీ సంస్థల నుంచి బలమైన రిజల్ట్స్​, రూపాయి బలహీనపడటంతో ఈ రంగానికి పెట్టుబడులు పెరుగుతాయన్న నమ్మకం బలపడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.  సెప్టెంబరు నాటికి యూఎస్ ఫెడ్ రేటు తగ్గింపుపై పెరుగుతున్న ఆశల వల్ల భారతీయ ఈక్విటీలలోకి ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐ పెట్టుబడులు అధికం అవుతున్నాయి.    

సెన్సెక్స్​షేర్లు ఇలా..

సెన్సెక్స్ షేర్లలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అత్యధికంగా 3.33 శాతం పెరిగింది.   ఇన్ఫోసిస్ 1.93 శాతం లాభపడింది.  బజాజ్ ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,  హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభపడ్డాయి. అయితే, ఏషియన్ పెయింట్స్, జేఎస్​డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ,  అదానీ పోర్ట్స్ వెనకబడి ఉన్నాయి. 

 బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 1.15 శాతం, మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.99 శాతం పడిపోయాయి.  సూచీలలో క్యాపిటల్ గూడ్స్ 2.03 శాతం, ఇండస్ట్రియల్స్ 1.95 శాతం, యుటిలిటీస్ 1.08 శాతం, సేవలు 0.87 శాతం పడిపోయాయి.  హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్, ఐటీ, టెలికమ్యూనికేషన్, ఆటో, టెక్ షేర్లు లాభపడ్డాయి.

ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్ లాభాల్లో స్థిరపడగా, సియోల్, టోక్యో నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.  బుధవారం అమెరికా మార్కెట్లు చాలా వరకు నష్టాల్లో ముగిశాయి.  గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 0.14 శాతం తగ్గి 84.96 డాలర్లకు చేరుకుంది.  ఫారిన్​ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు) మంగళవారం రూ.1,271.45 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు.