
ముంబై: బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. లాభాల స్వీకరణ చోటు చేసుకున్నప్పటికీ వరుసగా ఏడవ సెషన్ అయిన మంగళవారం కూడా గ్రీన్‌లో క్లోజయ్యాయి. 30 షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ 33 పాయింట్లు (0.04 శాతం) పెరిగి 78,017 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడేలో ఇది 757 పాయింట్లు (0.97 శాతం) ఎగసి 78,741.69 వరకు వెళ్లింది. నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 23,669 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎక్కువగా లాభపడ్డాయి.
జొమాటో షేర్లు మంగళవారం 6 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 5 శాతం పడ్డాయి. అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా నష్టాల్లో ముగిశాయి. ‘ఆరు రోజుల రికవరీ ర్యాలీ తర్వాత మార్కెట్‌లో ముఖ్యంగా స్మాల్, మిడ్ క్యాప్ షేర్లలో కొంత లాభాల స్వీకరణ కనిపించింది. ఈ సెగ్మెంట్‌లలో చాలా షేర్లు ప్రీమియం వాల్యుయేషన్స్‌తో ట్రేడవుతున్నాయి. గ్లోబల్‌గా సానుకూల సంకేతాలు కనిపించడంతో ఐటీ షేర్లు లాభపడ్డాయి.
ట్రంప్ సుంకాల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చనే అంచనాలతో పాటు ఐటీ షేర్ల వాల్యుయేషన్స్ పడడంతో తాజాగా ఇవి పుంజుకుంటున్నాయి’ అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) మంగళవారం నికరంగా రూ.5,371 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు.