Stock Market: ఒక్క రోజులో 8లక్షల కోట్లు ఫట్

Stock Market: ఒక్క రోజులో 8లక్షల కోట్లు ఫట్
  • మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరో దెబ్బ
  • చైనాపై అదనంగా 10 శాతం టారిఫ్ వేసిన ట్రంప్‌‌‌‌‌‌‌‌
  • భారీగా పతనమైన మన స్టాక్ మార్కెట్లు
  • 29 ఏండ్లలో తొలిసారివరుసగా ఐదో నెల రెడ్​లోనే క్లోజ్
  • గత ఐదు నెలల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.90 లక్షల కోట్లు ఆవిరి
  • బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు  2 శాతం  క్రాష్‌‌‌‌‌‌‌‌

ముంబై: యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనాపై అదనంగా 10 శాతం టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయడంతో మార్కెట్లు శుక్రవారం పతనమయ్యాయి. ఓపెన్ అయిన 45 నిమిషాల్లోనే ఇన్వెస్టర్లు రూ.6 లక్షల కోట్లు నష్టపోయారు. సెషన్ ముగిసేనాటికి రూ.8 లక్షల కోట్లు కోల్పోయారు. బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు  సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌, నిఫ్టీ  సుమారు 2 శాతం పడ్డాయి. నిఫ్టీ 418 పాయింట్లు తగ్గి 22,126 దగ్గర, సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌ 1,420 పాయింట్లు నష్టపోయి 73,192 దగ్గర ముగిశాయి. 

అన్ని సెక్టార్ల ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు నష్టాల్లో కదిలాయి.  ముఖ్యంగా స్మాల్‌‌‌‌‌‌‌‌, మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు 2 శాతానికిపైగా నష్టపోయాయి. ఐటీ, ఫైనాన్షియల్ షేర్లు ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లను కిందకి లాగాయి.  ఫిబ్రవరి నెలను కూడా  బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు నష్టాల్లోనే ముగించాయి. గత ఐదు నెలల్లో ఇన్వెస్టర్లు రూ.90 లక్షల కోట్లు నష్టపోయారు. కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.475 లక్షల కోట్ల నుంచి తాజాగా రూ.385 లక్షల కోట్లకు పడింది.  గత 29 ఏళ్లలో వరుసగా ఐదు నెలల పాటు  మార్కెట్ నష్టాల్లో ముగియడం ఇదే మొదటిసారి. మరోవైపు డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు తగ్గి 87.37కి పడింది.

ముదురుతున్న టారిఫ్ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

యూఎస్ ఎకానమీ బాగోలేదు. ఆ దేశంలో జాబ్‌‌‌‌‌‌‌‌లెస్ క్లెయిమ్స్ పెరగడం, జీడీపీ గ్రోత్ రేట్ కూడా అంచనాలను దాటకపోవడం, ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ గరిష్టాల్లో ఉండడంతో ఆ ఎఫెక్ట్  గ్లోబల్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లపై పడుతోంది. మెక్సికో, కెనడాపై వేస్తానని ప్రకటించిన 25 శాతం టారిఫ్ రేటు మార్చి 4 నుంచి అమల్లోకి వస్తుందని తాజాగా ట్రంప్  పేర్కొన్నారు.  దీంతో పాటు చైనీస్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై అదనంగా 10 శాతం సుంకాలు వేస్తామని అన్నారు. 

ఈ ఏడాది ఫిబ్రవరి 4 న చైనాపై 10 శాతం టారిఫ్‌‌‌‌‌‌‌‌ను యూఎస్ విధించింది. తాజాగా వేసిన టారిఫ్ కూడా కలుపుకుంటే చైనీస్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై వేస్తున్న టారిఫ్ రేటు 20 శాతానికి చేరుకుంటుంది. యూఎస్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై చైనా 15 శాతం టారిఫ్ విధించాలని గతంలో నిర్ణయించగా, తాజాగా వేసిన అదనపు టారిఫ్‌‌‌‌‌‌‌‌పై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.  రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ట్రేడ్‌‌‌‌‌‌‌‌ వార్ ముదురుతుండడంతో  మన మార్కెట్‌‌‌‌‌‌‌‌లు పడుతున్నాయి.

ఎనలిస్టులు ఏమంటున్నారంటే?

ట్రంప్‌‌‌‌‌‌‌‌ టారిఫ్‌‌‌‌‌‌‌‌ల ప్రకటనతో గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా అనిశ్చితి పెరుగుతోందని, దీనికి తోడు మార్కెట్‌‌‌‌‌‌‌‌ వాల్యుయేషన్ ఎక్కువగా ఉండడంతో ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు భారీగా పడుతున్నాయని ది స్ట్రీట్స్‌‌‌‌‌‌‌‌ ఫండ్ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కునాల్ రాంభాయ్‌‌‌‌‌‌‌‌  పేర్కొన్నారు. స్మాల్‌‌‌‌‌‌‌‌, మిడ్ క్యాప్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌ వాల్యుయేషన్స్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉందని తెలిపారు. తానైతే  40–60 శాతం మేర పడ్డ క్వాలిటీ షేర్లను గుర్తించి, వాటిలో ఇన్వెస్ట్ చేస్తానని అన్నారు. 

మార్కెట్‌‌‌‌‌‌‌‌కు  అనిశ్చితి నచ్చదని, ట్రంప్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా అనిశ్చితి పెరుగుతోందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ ఎనలిస్ట్‌‌ వీకే విజయకుమార్ పేర్కొన్నారు.  ట్రంప్‌‌‌‌‌‌‌‌  టారిఫ్‌‌‌‌‌‌‌‌లతో దేశాలను బెదిరిస్తున్నారని, ఆ తర్వాత తనకు లాభపడే డీల్స్‌‌‌‌‌‌‌‌ను కుదుర్చుకోవాలని చూస్తున్నారని అన్నారు. చైనాపై విధించిన టారిఫ్ దీనికి నిదర్శనమని తెలిపారు.

1) ఐటీ  షేర్లపై అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. యూఎస్ కంపెనీ ఎన్విడియా రిజల్ట్స్ మెప్పించకపోవడంతో గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా టెక్ షేర్లు నష్టపోతున్నాయి. మన ఐటీ ఎగుమతులు ఎక్కువగా నార్త్ అమెరికాకు ఉండడంతో ట్రంప్ టారిఫ్ పాలసీ మనపై ఎలా ఉంటుందోనన్న ఆందోళనలు పెరిగాయి.  నిఫ్టీ ఐటీ ఇండెక్స్ శుక్రవారం సెషన్‌‌‌‌‌‌‌‌లో 4 శాతం పతనమైంది. టెక్ మహీంద్రా, విప్రో, ఎంఫసిస్‌‌‌‌‌‌‌‌ షేర్లు 5 శాతం క్రాష్ అవ్వగా, ఎల్ అండ్ టీ మైండ్‌‌‌‌‌‌‌‌ట్రీ, ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌ షేర్లు 4 శాతం మేర పడ్డాయి. 

2)  గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా మెజార్టీ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడుతోంది. డాలర్ ఇండెక్స్  కొన్ని వారాల గరిష్టమైన 107.35  దగ్గర ట్రేడవుతోంది. డాలర్ బలపడితే ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు నష్టపోతాయి. ఫారిన్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు మార్కెట్ నుంచి వెళ్లిపోతాయి. దీనికితోడు యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్‌‌‌‌‌‌‌‌ కూడా పెరుగుతున్నాయి. 

3) ఫారిన్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐలు) మార్కెట్‌‌‌‌‌‌‌‌లో నికర అమ్మకందారులుగా కొనసాగుతున్నారు. శుక్రవారం సెషన్‌‌‌‌‌‌‌‌లో నికరంగా రూ.11,639 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ. 1.10 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ను విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకున్నారు. డొమెస్టిక్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (డీఐఐలు) కొనుగోళ్లు జరుపుతుండడంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌ పతనం ఆగుతోంది. డీఐఐలు  శుక్రవారం నికరంగా రూ.12,308 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.