రెండో రోజూ మార్కెట్లను వదలని నష్టాలు

రెండో రోజూ మార్కెట్లను వదలని నష్టాలు
  • 4 నెలల కనిష్టానికి సెన్సెక్స్​.. 984 పాయింట్లు పతనం
  • నిఫ్టీ 324 పాయింట్లు డౌన్​ 
  • రెండు రోజుల్లో రూ. 13 లక్షల కోట్ల లాస్​

ముంబై: వరుసగా రెండో రోజూ మార్కెట్లకు భారీ నష్టాలు వచ్చాయి. విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్లు మార్కెట్ నుంచి వెళ్లిపోతుండడం, ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్టానికి ఎగబాకడంతోపాటు బ్యాంకింగ్, ఆటో,  క్యాపిటల్ గూడ్స్ షేర్లలో భారీ అమ్మకాల నేపథ్యంలో బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ సెన్సెక్స్ బుధవారం నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది. ఇది 984.23 పాయింట్లు క్షీణించి 77,690.95 కు పతనమయింది.  ఇంట్రాడేలో 1,141.88 పాయింట్లు పడి 77,533.30 వద్దకు చేరుకుంది.  నిఫ్టీ వరుసగా ఐదో రోజూ నష్టపోయింది. ఇది 324.40 పాయింట్లు  తగ్గి 23,559.05 వద్దకు చేరుకుంది.

 30-షేర్ల సెన్సెక్స్ ప్యాక్ నుంచి, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, జేఎస్​డబ్ల్యూ  స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్,  కోటక్ మహీంద్రా బ్యాంక్‌‌‌‌‌‌‌‌లు  వెనకబడి ఉన్నాయి.  టాటా మోటార్స్, ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ లాభపడ్డాయి.  

బలహీనమైన కార్పొరేట్ ఆదాయాల మధ్య ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐలు భారీగా అమ్మకాలు జరపడం, దేశీయ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయికి పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ను మరింత దెబ్బతీశాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. భవిష్యత్ యూఎస్ పాలసీ చర్యల గురించి మార్కెట్లు గందరగోళంగా ఉన్నాయని తెలిపారు.   విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐలు) మంగళవారం రూ. 3,024.31 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.   బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్‌‌‌‌‌‌‌‌ 3.08 శాతం, మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్‌‌‌‌‌‌‌‌ 2.56 శాతం క్షీణించాయి.

 అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.   ఆసియా మార్కెట్లలో షాంఘై లాభపడింది.  సియోల్, టోక్యో,  హాంకాంగ్ నష్టాలతో ముగిశాయి.  యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.  మంగళవారం అమెరికా మార్కెట్లు ప్రతికూలంగా ముగిశాయి.   గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు 0.93 శాతం పెరిగి 72.56 డాలర్లకు చేరుకుంది.  బీఎస్​ఈ బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌లో రెండు రోజుల క్రాష్‌‌‌‌‌‌‌‌ వల్ల ఈక్విటీ ఇన్వెస్టర్లు రూ. 13 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయారు.

రెండు రోజుల్లో బీఎస్​ఈ బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ 1,805.2 పాయింట్లు లేదా 2.27 శాతం పడిపోయింది. బుధవారం 984.23 పాయింట్లు లేదా 1.25 శాతం క్షీణించి 77,690.95 వద్ద స్థిరపడింది.  బీఎస్​ఈ- లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు రోజుల్లో రూ.13,07,898.47 కోట్లు తగ్గి రూ.4,29,46,189.52 కోట్లకు (5.09 ట్రిలియన్ డాలర్లు) చేరుకుంది.