హైదరాబాద్, వెలుగు: నల్లకుంట ఐసీఐసీఐ బ్రాంచ్ డిప్యూటీ మేనేజర్ సలేహ బేగం సమయస్పూర్తితో వ్యవహరించి సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును హోల్డ్ చేశారు. సైబర్ క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ ఫెరోజ్‌తో కలిసి రూ.20.50 లక్షలను సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడారు. వీరిద్దరిని సీపీ సీవీ ఆనంద్ శుక్రవారం అభినందించి, ప్రశంసపత్రాలు అందజేశారు.
స్టాక్ ట్రేడింగ్‌లో రూ.9లక్షలు
వారాసిగూడకు చెందిన శ్రీనివాస్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కాడు. ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్‌లో భాగంగా మంగళవారం వరకు రూ.3 లక్షలు ట్రేడింగ్ చేశాడు. ఆ తర్వాత బుధవారం మరో రూ.9 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఈ డబ్బంతా నల్లకుంట ఐసీఐసీఐ బ్యాంక్‌లో డిపాజిట్ అయ్యాయి. శ్రీనివాస్ డబ్బు ట్రాన్స్‌ఫర్ అయిన బెన్‌ఫిషరీ అకౌంట్‌లో కేవలం వందలు, వేలు మాత్రమే బ్యాలెన్స్ ఉండేవి. ఒక్కసారిగా ఇన్ని లక్షలు వచ్చి పడుతుండడంతో బ్రాంచ్ డిప్యూటీ మేనేజర్ సలేహ బేగంకు అనుమానం వచ్చింది.
శ్రీనివాస్ అకౌంట్ నుంచి ఈ క్యాష్ ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించి, వెంటనే సిటీ సైబర్ క్రైమ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఫెరోజ్‌కు సమాచారం అందించింది. అనంతరం ఇద్దరూ కలిసి బాధితుడు శ్రీనివాస్‌ను కాంటాక్ట్ అయ్యారు. స్టాక్ ట్రేడింగ్‌లో పేమెంట్స్ వెంటనే నిలిపివేయాలని సూచించారు. రూ.3 లక్షలను అప్పటికే సైబర్ నేరస్తులు ట్రాన్స్‌ఫర్ చేసుకోగా, రూ.9లక్షలను హోల్డ్ చేశారు.
డిజిటల్ అరెస్ట్‌లో రూ.11.50 లక్షలు సేఫ్
అడిక్‌మెట్‌కు చెందిన సంధ్యల నవీన్‌కుమార్‌ను మనీలాండరింగ్, డిజిటల్ అరెస్ట్ పేరుతో బుధవారం సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేశారు. నవీన్ కుమార్‌ను బెదిరిస్తూ రూ.11.50 లక్షలు వసూలు చేశారు. ఈ డబ్బు కూడా నల్లకుంట ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉన్న సైబర్ నేరగాళ్ల అకౌంట్‌లోకి చేరింది. అప్పటికే ఇలాంటి ట్రాన్సాక్షన్స్‌పై నిఘా పెట్టిన సలేహ బేగం అప్రమత్తమైంది.
హెడ్‌కానిస్టేబుల్ ఫెరోజ్ సహకారంతో బాధితుడు నవీన్‌కుమార్‌ను సంప్రదించింది. బెన్‌ఫిషరీ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లకు డబ్బు ట్రాన్స్‌ఫర్ కాకుండా హోల్డ్ చేసింది. ఈ రెండు కేసుల్లో సైబర్ నేరగాళ్లు ఆపరేట్ చేస్తున్న అకౌంట్స్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుని ఏసీపీ శివమారుతి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.