స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగిన ఒక్కగానొక్క టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు పలు రికార్డులు సృష్టించారు. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ 93 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టగా, ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్.. ఇలా ఎందులో ప్రమేయం లేకుండానే టెస్ట్ మ్యాచ్ గెలిచిన మొదటి టెస్ట్ కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఐదు వికెట్లతో రాణించడంతో ఐర్లాండ్ 172 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆటగాళ్లు.. ఐరిష్ బౌలర్లను ఆటాడుకున్నారు. హాఫ్ సెంచరీ, సెంచరీ, డబుల్ సెంచరీ అంటూ పరుగుల దాహాన్ని తీర్చుకున్నారు. ఓలీ పోప్ డబుల్ సెంచరీ(205) చేయగా, బెన్ డకెట్ సెంచరీ(182) చేశాడు. జాక్ క్రాలీ(56), జో రూట్(56) లు హాఫ్ సెంచరీలు చేశారు. 4 వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్ 524 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఐర్లాండ్ ఆటగాళ్లు.. ఇంగ్లీష్ బౌలర్లను ధీటుగానే ఎదుర్కొన్నారు. ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో రాణించారు. మార్క్ అదైర్ (88) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా, ఆండీ మెక్ బ్రైన్ (88), హ్యారి టెక్టార్ (51) పరుగులతో రాణించారు. 362 పరుగుల వద్ద ఐర్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ ముగియగా, 11 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 4 బంతుల్లోనే చేధించింది. ఏదేమైనా బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్.. ఇలా ఎందులో ప్రమేయం లేకుండా విజయం సాధించిన కెప్టెన్ గా బెన్ స్టోక్స్ ఒంటరిగా మిగిలి పోతాడేమో.
https://twitter.com/mufaddal_vohra/status/1665024994752225280