ఆకలి తీర్చే దేవత.. వందేళ్ల తర్వాత తిరిగొచ్చింది

స్వాతంత్ర్యానికి పూర్వమే మనదేశం నుంచి వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఎన్నో విలువైన విగ్రహాలు, కళాఖండాలు, పురాతన వస్తువులు దోపిడీకి, అక్రమ రవాణాకు గురయ్యాయి. వీటిలో చాలా వరకు విదేశాలకు తరలిపోగా.. మరికొన్ని ధ్వంసం చేయబడ్డాయి. ఇలా దోపిడీకి గురైన పురాతన విగ్రహాలను వెనక్కి తెప్పించేందుకు దశాబ్దాలుగా మన దేశం ప్రయత్నిస్తూనే ఉంది. మన ప్రయత్నాలు ఫలించడంతో 1976 నుంచి ఇప్పటి వరకూ మనదేశం నుంచి దోపిడీకి గురైన 55 పురాతన విగ్రహాలు, వస్తువులను వివిధ దేశాలు తిరిగి ఇచ్చాయి. ఇందులో 75 శాతం అంటే 42 పురాతన విగ్రహాలు, వస్తువులను నరేంద్ర మోడీ ప్రధానమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాతే వెనక్కి తీసుకొచ్చారు. తాజాగా వందేండ్లకుపైగా చరిత్ర కలిగిన కాశి అన్నపూర్ణా దేవి విగ్రహం కెనడా నుంచి మనదేశం చేరింది. ఈ విషయాన్ని మన్​ కీ బాత్​ కార్యక్రమంలో ప్రధాని మోడీ దేశ ప్రజలందరికీ తెలియజేశారు. భారత పురావస్తు శాఖ ఈ విగ్రహాన్ని అక్టోబర్ 5న అందుకున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి ధ్రువీకరించారు. ఈ విగ్రహం నవంబర్​ 11న ఢిల్లీ నుంచి శోభా యాత్రగా వారణాసి చేరుతుంది. అక్కడి అన్నపూర్ణాదేవి ఆలయంలో దీనిని తిరిగి ప్రతిష్ఠిస్తారు.

18వ శతాబ్దం నాటి విగ్రహం..

మనదేశంలో అన్నపూర్ణా దేవిని కొలుస్తూ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఇందులో వారణాసిలోని అన్నపూర్ణ ఆలయం అతి ముఖ్యమైనది. పవిత్రమైనది. మరాఠా సామ్రాజ్యంలో బాజీరావు పీష్వా 1729లో ఈ ఆలయం నిర్మించారు. కాశీ విశ్వనాథునితో పాటు అన్నపూర్ణా దేవి ఆలయాన్ని ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. 18వ శతాబ్దం నాటి ఎంతో విలువైన అన్నపూర్ణా దేవి విగ్రహాన్ని కెనడాకు చెందిన నార్మన్ మెకంజీ అనే లాయర్​ 1913లో వారణాసిలో కొంత మందిని పురమాయించి దొంగతనం చేయించారు. బనారస్ శైలిలో చెక్కిన అన్నపూర్ణా దేవి విగ్రహం కెనడాలోని రెజీనా యూనివర్సిటీలోని మెకంజీ ఆర్ట్ గ్యాలరీలో ఇప్పటి వరకూ ఉందనే విషయం 2019 వరకూ ఎవరికీ తెలియదు. దివ్యమెహ్రా అనే కళాకారిణి ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విన్నిపెగ్ కు చెందిన దివ్య మెహ్రా 2019లో పురాతన కళాఖండాలపై పరిశోధన చేస్తుండగా విష్ణుమూర్తి విగ్రహం స్త్రీ రూపంలో అన్న పాత్ర పట్టుకుని ఉండడం ఆమె కంటపడింది. పాత రికార్డులను తిరగేస్తే ఈ విగ్రహం 18వ శతాబ్దం నాటిదని, 1913లో వారణాసిలో దొంగిలించబడిందని ఆమె గుర్తించారు. ఈ విగ్రహం గురించి ఆర్ట్ గ్యాలరీ సీఈవోతో మాట్లాడిన దివ్య మెహ్ర.. అన్నపూర్ణాదేవి విగ్రహం గురించి తాను చేసిన పరిశోధన విషయాలను ఒట్టావాలోని ఇండియన్​ హై కమిషన్, కెనడియన్ హెరిటేజ్  డిపార్ట్​మెంట్​దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం దృష్టికి హైకమిషనర్​ తీసుకొచ్చారు. కేంద్ర పర్యటన, సాంస్కృతిక శాఖల మంత్రి కిషన్​రెడ్డి దృష్టికి రావడంతో దీనిని తిరిగి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించారు. ఇదొక్కటే కాదు ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో కీలక అంశాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తేవడంలో ఆయన కృషి ఎంతో ఉంది.

ఐదు రోజుల శోభాయాత్ర

మన దేశం నుంచి దొంగిలించబడిన పురాతన అన్నపూర్ణా దేవి విగ్రహాన్ని తిరిగి తెస్తున్న విషయాన్ని ప్రధాని మోడీ ఇటీవలే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా యావత్ దేశానికి తెలిపారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఎంబసీల్లో ఒక అధికారికి దేశ సాంస్కృతిక, పర్యాటక వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అనుమతులు రావడంలో కిషన్ రెడ్డి కృషి ఎంతో ఉంది. వీటన్నింటి ఫలితంగానే దాదాపు వందేండ్ల తర్వాత అన్నపూర్ణా దేవి విగ్రహం కెనడా నుంచి మనదేశానికి వచ్చింది. భారత పురావస్తు శాఖ ఈ విగ్రహాన్ని అక్టోబర్ 5న అందుకుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. కాగా, ఈ విగ్రహాన్ని నవంబర్ 11న ఢిల్లీ నుంచి వారణాసి తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం ఐదు రోజుల పాటు దాదాపు 800 కిలోమీటర్ల దూరం శోభా యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్ర పూర్తయిన తర్వాత వారణాసిలోని అన్నపూర్ణా దేవి ఆలయంలో విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠిస్తారని కిషన్​రెడ్డి వెల్లడించారు. ఎంతో చరిత్ర కలిగిన అన్నపూర్ణ మాత విగ్రహాన్ని దర్శించుకుని పూజలు చేసే అవకాశం దక్కడం మనందరి అదృష్టం. కాశి వెళ్లినప్పుడు అన్నపూర్ణ విగ్రహాన్ని దర్శించుకోవడం భక్తులు మరిచిపోవద్దు.

ఆకలి తీర్చే దేవత

పర్వతరాజు అయిన హిమవంతుడి కుమార్తె పార్వతి దేవియే అన్నపూర్ణ. అన్నపూర్ణాదేవి అంటే అన్నం, పోషణ ఇచ్చే దేవత. అన్నం లేనిదే ఏ ప్రాణి జీవించలేదు. అన్నపూర్ణ మాత చిత్ర పటాన్ని లేదా విగ్రహన్నీ గమనిస్తే ఎడమ చేతిలో గిన్నె నిండుగా అన్నం, కుడి చేతితో శివునికి వడ్డిస్తున్న దృశ్యం కనబడతాయి. సాక్షాత్తు పరమ శివుడుకే ఆహారాన్ని భిక్షగా వేసిన కాశి అన్నపూర్ణ గురించి పురాణాల ద్వారా తెలుస్తుంది. ఒకసారి పరమ శివుడు ప్రపంచంలో అన్నం సహా అన్నీ మాయే అని అంటాడు. భక్తుల ఆకలి తీర్చే అమ్మ అయిన పార్వతికి శివుడి మాటలు నచ్చక కైలాసం నుంచి మాయమవుతుంది. దీంతో ఆహారం దొరక్క దేవతలు, ప్రజలు అలమటిస్తారు. చివరికి వారణాసిలోని ఒక వంట గదిలో ఆహారం దొరుకుతుందని తెలుసుకున్న దేవతలు, ప్రజలు.. శివునితో పాటు అక్కడికి వెళతారు. అన్నపూర్ణ అవతారంలో ఉన్న పార్వతీ మాత అక్కడ అందరికీ ఆహారం అందిస్తోంది. తన మాటలను వెనక్కి తీసుకొని భిక్ష పాత్రను పట్టుకొని పార్వతిదేవి వద్ద కు వెళ్లి శివుడు ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. అప్పటి నుంచి పార్వతీ దేవి.. అన్నపూర్ణగా ఆకలి తీరుస్తున్నదని భక్తుల నమ్మకం. 

- డా.పి.హర్షభార్గవి,

పీఆర్వో, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్​ ఆర్ట్