- పలు వాహనాలు ధ్వంసం, చెదరగొట్టిన పోలీసులు
నల్గొండ అర్బన్, వెలుగు : కూలి విషయంలో బిహార్, స్థానిక కూలీల మధ్య నడుస్తున్న వివాదం నల్గొండ పట్టణంలో రాళ్ల దాడికి దారి తీసింది. ఇంటి నిర్మాణ పనులు చేసే కూలీలు ప్రతి రోజూ మాదిరిగానే నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో ఉన్న డీఈఓ కార్యాలయం ఎదురుగా పని కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా లోకల్ కూలీలపైకి బిహార్‌కు చెందిన కూలీలు రాళ్ల దాడి చేశారు. ఈ సమయంలో అటుగా వెళ్తున్న వాహనాలు ధ్వంసమయ్యాయి. కొద్ది రోజులుగా కూలీ విషయంలో స్థానిక, బిహార్ కూలీలకు మధ్య ఘర్షణ జరుగుతోంది. లోకల్కూలీలు రూ.600నుంచి రూ.700 లకు పనులకు వెళ్తుండగా, బిహార్ కూలీలు రూ.200 నుంచి రూ.400లకే చేస్తున్నారు. దీంతో చాలామంది బిహార్‌కు చెందిన కూలీల వైపే మొగ్గు చూపుతున్నారు.
బిల్డింగ్నిర్మాణ పనుల విషయంతో పాటు పీఓపీ ఇతర పనులకు కూడా బిహార్‌కు చెందిన కూలీలనే కాంట్రాక్టర్లు తీసుకెళ్తుండడంతో తమ పొట్టకొడుతున్నారని లోకల్కూలీలు ఆవేదన చెందుతున్నారు. బిహార్కూలీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆదివారం డీఈఓ ఆఫీసు ఎదుట పని కోసం వేచి ఉన్న లోకల్ కూలీలపైకి బిహార్కూలీలు రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు. బిత్తరపోయిన స్థానిక కూలీలు భయంతో పరుగులు తీశారు. రంగంలోకి దిగిన వన్‌టౌన్‌పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి కొంత మందిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాళ్ల దాడికి పాల్పడిన బిహార్‌కు చెందిన 18 మంది, లోకల్‌కు చెందిన 12 మంది కూలీలను గుర్తించారు. సీసీ కెమెరాల పుటేజీ ద్వారా మిగతా వారిని గుర్తించే పనిలో పడ్డారు.