కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి.. న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉద్రిక్తత

న్యూఢిల్లీ: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (జనవరి 18) ఆయన పోటీ చేస్తోన్న న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కేజ్రీవాల్ క్యాంపెయినింగ్ చేశారు. ప్రచారం ముగించుకుని వెళ్తుండగా కేజ్రీవాల్ ప్రయాణిస్తోన్న కారుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. మరికొందరు కేజ్రీవాల్ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని కేజ్రీవాల్‎ను అక్కడి నుండి పంపించారు. 

కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి జరిగిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‎పై జరిగిన రాళ్ల దాడి ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి ఘటనపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయిన ఆప్.. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. న్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ కిరాయి గుండాలే కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి చేశారని ఆప్ ఆరోపించింది. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఆప్ అధినేత కేజ్రీవాల్‎పై భౌతిక దాడులకు దిగుతోందని ఫైర్ అయ్యింది. 

Also Read : బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి

బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గూండాలు కేజ్రీవాల్‌పై ఇటుకలు, రాళ్లతో దాడి చేసి ప్రచారం చేయకుండా దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ధ్వజమెత్తింది ఆప్. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన ఆప్.. ఇలాంటి దాడులకు కేజ్రీవాల్ భయపడరని.. ఆయన మరింత ధైర్యంతో ప్రజల్లోకి వెళ్తారని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ పై దాడి చేసిన బీజేపీకి ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొంది. కాగా, 2025, ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.