ఈటల ప్రచారం చేస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

  • మునుగోడు మండలం పలివెల రణరంగం
  • ఈటల రాజేందర్​ గన్ మన్, పీఆర్వో, అనుచరులకు గాయాలు
  • ప్రచార రథంతోపాటు ఆరు  వాహనాల అద్దాలు ధ్వంసం
  • ఘటన స్థలంలో టీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
  • పల్లా ప్రోద్బలంతోనే దాడి చేశారు: ఈటల 

మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు : మునుగోడు మండలం పలివెలలో ప్రచారానికి వెళ్లిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై మంగళవారం మధ్యాహ్నం టీఆర్​ఎస్​ కార్యకర్తలు రాళ్లు, కట్టెలతో ఎగబడ్డారు. ఈటల లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఆయన గన్ మన్, పీఆర్వోతోపాటు పలువురు అనుచరులు తీవ్రంగా గాయపడ్డారు. బీజేపీ ఎన్నికల ప్రచార రథంతోపాటు  కాన్వాయ్ లోని ఆరు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో పలివెల గ్రామం రణరంగమైంది. 

గ్రామస్తులతో మాట్లాడుతుండగా..!

ఉప ఎన్నిక ప్రచారానికి చివరి రోజు కావడంతో తన తల్లిగారి ఊరైన పలివెలలో ఈటల భార్య జమున మహిళలతో కలిసి మంగళవారం ఉదయం ప్రచారం ప్రారంభించారు. పలివెల సెంటర్ లో ముగింపు సమావేశం కోసం రెండు రోజుల ముందే బీజేపీ నాయకులు పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు. ఈ మీటింగ్ కు చీఫ్ గెస్ట్ గా ఈటల హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆయన తన కాన్వాయ్ తో పలివెలకు చేరుకున్నారు. ఊరిలోకి ఎంటర్ అయ్యాక ర్యాలీ నిర్వహించారు. తర్వాత గ్రామస్తులను ఉద్దేశించి ఈటల మాట్లాడుతుండగా.. అప్పటికే అక్కడికి కేటీఆర్ రోడ్డు షోలో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలతో చేరుకున్నారు.  ఈటల ప్రసంగానికి ఆటంకం కలిగించేలా టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు ప్రతిగా నినాదాలు చేయగా.. టీఆర్ఎస్ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి జెండా కట్టెలు, రాళ్లతో  దాడికి దిగారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. 

4 కిలోమీటర్ల వరకు వెంటాడుతూ..!

ఈటల రాజేందర్​ లక్ష్యంగా టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీంతో పక్కనే ఉన్న ఆయన గన్ మన్, పీఆర్వోకు గాయాలయ్యాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడం, అప్పటికే కేటీఆర్ రోడ్డు షో కోసం భారీగా బైక్ లతో టీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటుండడంతో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ నాయకులు తమ వాహనాల్లో మునుగోడు వైపు బయల్దేరారు. తాము వాహనాల్లో స్టార్ట్ అయ్యాక కూడా నాలుగు కిలోమీటర్ల వరకు తమను వెంటాడుతూ రాళ్లతో దాడి చేశారని ఈటల పీఆర్వో చైతన్య తెలిపారు. 

గాయపడిన వారిని పరామర్శించిన నేతలు

ఆరు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ ప్రచార రథంపై ఉన్న ఫ్లెక్లీలను కట్టెలతో బాదుతూ చించేశారు. బీజేపీ క్యాంప్ ఆఫీసుకు చేరుకున్న ఈటల రాజేందర్ తోపాటు గాయపడినవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్​రెడ్డి పరామర్శించారు. అనంతరం ఈ ఘటనపై ఈటల పీఆర్వో చైతన్య మునుగోడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి, ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, టీఆర్ఎస్ నాయకుడు భవనం శ్రీనివాస్ రెడ్డికి కూడా గాయాలయ్యాయని టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. పలిమెల గ్రామాన్ని నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి సాయంత్రం సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు.

పోలీసుల వైఫల్యం వల్లే ఈటల కాన్వాయ్​పై దాడి : బీజేపీ నేత గూడూరు

హైదరాబాద్, వెలుగు: పోలీసుల వైఫల్యం వల్లే ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కాన్వాయ్​పై దాడి జరిగిందని బీజేపీ రాష్ట్ర నేత గూడూరు నారాయణరెడ్డి ప్రకటనలో మండిపడ్డారు. పలి వెలలో ఈటల కాన్వాయ్‌పై టీఆర్‌ ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారని, ఇం దులో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారన్నారు. గతంలో ప్రచారం సందర్భంగా కిషన్‌రెడ్డి మీటింగ్​ను అడ్డుకునేందుకు టీఆర్‌ ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారని, రాజగోపాలరెడ్డిపై దాడి చేశారని గుర్తు చేశారు. పలివెలలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేయాలని ఇదివరకే కోరినా.. పోలీసులు ఆ పని చేయ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.