ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపడుతున్నామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ తెలిపారు. ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం రూపొందించిన మహా ధర్నా పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి చనిపోవడం, కాళ్లు చేతులు విరిగిపోవడం జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రమాద నివారణ చర్యలు తీసుకొని మేకులతో పాటు బైక్ లు అందించాలన్నారు. 2023 – 24 బడ్జెట్లో గీత కార్మికులకు కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.