![మహబూబాబాద్లో వింత ఘటన.. చీకటి పడితే చాలు.. ఇళ్లపై రాళ్లు పడుతున్నయ్..!](https://static.v6velugu.com/uploads/2025/02/stones-falling-on-homes-in-vaddera-basti-mahabubabad-town_SpT23GFRxb.jpg)
మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీలో వింత ఘటన జరిగింది. రాళ్ళ భయంతో కాలనీ వాసులు హడలెత్తి పోతున్నారు. కంటి మీద కునుకు లేకుండా ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చీకటి పడితే చాలు నలు దుక్కుల నుంచి రాళ్ళ వర్షం పడుతుండటం కాలనీవాసుల్లో భయాందోళనకు కారణమవుతోంది. ఇండ్లపై రాళ్ళు పడుతున్నాయి. ఆ రాళ్ళు ఎలా పడుతున్నాయో అర్థం కాక కాలనీ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దెయ్యమా..? భూతమా..? (లేదా) చేతబడి చేశారా..? ఇలా మూఢ నమ్మకాలతో బెంబేలెత్తిపోతున్నారు. కొందరు కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read :- అగ్గిపెట్టె సైజు గది.. అద్దె 25 వేలా..?
రాళ్ళ భయంతో రాత్రంతా గస్తీ కాస్తున్నారు. మహబూబాబాద్ వడ్డెర కాలనీవాసులను కదిలిస్తే చాలు.. భయంతో వణికిపోతున్నారు. భయంతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో ఉండలేక కొన్ని కుటుంబాలు అయితే ఇల్లు వదిలి వెళ్లిపోయిన పరిస్థితి. తమకు ధైర్యం కల్పించాలని, ఈ రాళ్లు ఎందుకు ఇలా పడుతున్నాయో తేల్చి రక్షణ కల్పించాలని కాలనీవాసులు పోలీసులను వేడుకున్నారు. తెల్లవారుజామున ఏ ఇంటి ముందు చూసినా పసువు, కుంకుమ, నిమ్మకాయలు కనిపిస్తుండటం గమనార్హం. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.