న్యూఢిల్లీ: ఇబ్బందికరమైన కాల్స్ పెరుగుతున్నాయంటూ భారీగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ట్రాయ్ ఈ విషయమై టెల్కోలకు, వారి టెలిమార్కెటర్లకు వార్నింగ్ఇచ్చింది. వాయిస్ కాల్బల్క్ కమ్యూనికేషన్‌లను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అన్ని భాగస్వామ్యపక్షాలు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. విసిగించే కాల్స్ చేసే వారిని గుర్తించడానికి టెక్నికల్ సొల్యూషన్స్ వాడాలని సూచించింది.
అనవసర కమర్షియల్ కాల్స్ గురించి వినియోగదారుల ఫిర్యాదుల దృష్ట్యా స్పామర్‌లపై చర్య తీసుకోవడానికి మంగళవారం యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లు, వారి డెలివరీ టెలిమార్కెటర్లతో సమావేశం నిర్వహించామని ట్రాయ్ తెలిపింది. సంబంధిత సంస్థలకు తెలియకుండా హెడర్లు, కంటెంట్ టెంప్లేట్‌లను దుర్వినియోగం చేయడంపై సమావేశం చర్చించింది. రోబోటిక్ కాల్స్, ఆటో-డయలర్ కాల్స్‌ను నియంత్రించడంపైనా సమాలోచనలు జరిగాయి.