- లేకపోతే సైనిక చర్య తప్పదు
- హౌతీ రెబెల్స్‌కు అమెరికా సహా మొత్తం 12 దేశాల వార్నింగ్
వాషింగ్టన్ : ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులను వెంటనే ఆపాలని యెమెన్‌లోని హౌతీ రెబెల్స్‌ను అమెరికా సహా మొత్తం 12 దేశాలు హెచ్చరించాయి. దాడులు ఆపకపోతే సైనిక చర్య తప్పదని ప్రకటించాయి. ఇజ్రాయెల్– హమాస్ యుద్ధం నేపథ్యంలో హౌతీ రెబెల్స్ ఇటీవల ఎర్ర సముద్రం గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలపై వరుసగా డ్రోన్, మిసైల్ దాడులు చేస్తున్నాయి. హమాస్‌కు మద్దతుగానే హౌతీలు ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఉన్న నౌకలను టార్గెట్ చేసుకుంటున్నారు. హౌతీలకు ఇరాన్ నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో హౌతీలకు అమెరికా, దాని మిత్ర దేశాలు వార్నింగ్ ఇచ్చాయి. దాడులు చేయడం, నౌకలను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం వంటివి కొనసాగితే మరోసారి హెచ్చరికలు ఉండబోవని తేల్చిచెప్పాయి.
బుధవారం ఈ మేరకు అమెరికా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, కెనడా, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, సింగపూర్, బ్రిటన్ దేశాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. హౌతీలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చర్యలు తీసుకోవాలని అమెరికా పిలుపునిచ్చింది. హౌతీలకు వాణిజ్య నౌకలపై దాడులతో గ్లోబల్ ఎకానమీకి, సెయిలర్ల ప్రాణాలకు ముప్పు కలిగితే సహించబోమని పేర్కొంది. వాణిజ్య నౌకలపై దాడులను చైనా కూడా ఖండించింది. కానీ ఇరాన్‌తో సన్నిహిత సంబంధాల కారణంగా హౌతీలను ప్రస్తావించకుండానే చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మీడియా ముందు తూతూమంత్రంగా ప్రకటన చేశారు.