![విద్యుదుత్పత్తిని నిలిపేయండి.. ఏపీ, తెలంగాణకు కేఆర్‌ఎంబీ లేఖ](https://static.v6velugu.com/uploads/2024/11/stop-power-generation-in-nagarjuna-sagar-and-srisailam-krmb-writes-letter-to-ap-and-telangana_8zvgb9PucF.jpg)
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం, నాగర్జున సాగర్ ప్రాజెక్టుల కాల్వల ద్వారా విద్యుదుత్పత్తిని నిలిపేయాలని ఏపీ, తెలంగాణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ) ఆదేశించింది. మంగళవారం రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది. 2025 వానాకాలం వరకు నీటిని వాడుకోవాల్సి ఉన్నందున జలాలను పొదుపుగా వాడుకోవాలని సూచించింది.
ఈ నేపథ్యంలోనే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకెళ్లే పోతిరెడ్డిపాడు (శ్రీశైలం కుడి ప్రధాన కాల్వ), సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా విద్యుదుత్పత్తిని వెంటనే నిలిపేయాలని లేఖలో పేర్కొంది. విభజన చట్టం షెడ్యూల్ 11లో రెండు ప్రాజెక్టుల ద్వారా విద్యుదుత్పత్తికి తక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, దానిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో రెండు రాష్ట్రాల తాగు, సాగు నీటి అవసరాలను తీర్చుకునేందుకు వీలుగా విద్యుదుత్పత్తిని నిలిపేయాలని సూచించింది. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కాగా, విద్యుదుత్పత్తిని నిలిపేయాలంటూ ఇటీవలే బోర్డు లేఖ రాసినా.. అలాగే విద్యుదుత్పత్తిని కొనసాగిస్తుండడంతో మరోసారి రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది.