
ఛావా సినిమాపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరించే వాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. చరిత్రను వక్రీకరించి లబ్ది పొందాలని చూసే వాళ్లు చరిత్ర గురించి పట్టించుకోరని అన్నారు. వారికి అనుగుణంగా వక్రీకరిస్తూ ప్రజలను విడదీస్తారని మండిపడ్డారు
చరిత్రను వాట్సాప్ లో చదవడం మానేయాలని పిలుపునిచ్చారు థాక్రే. చరిత్రను పుస్తకాల నుంచి నేర్చుకోవాలిన అన్నారు. చరిత్రను వక్రీకరిస్తూ మహారాష్ట్రను నాశనం చేయాలని చూస్తున్నారని, కానీ వారే చరిత్ర నుంచి తుడిచిపెట్టుకుపోతారని అన్నారు. ముంబైలో గుడిపడ్వా ర్యాలీలో భాగంగా ఈ కామెంట్స్ చేశారు.
ఛత్రపతి షంభాజీ నగర్ జిల్లాలోని ఔరంగజేబు సమాధిని తొలగించాలని రైట్ వింగ్ గ్రూప్ నుంచి వస్తున్న డిమాండ్లపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుతం ఉన్న అసలు సమస్యలు మరిచిపోయాం. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి వివాదాలను తెరపైకి తెస్తున్నారు. షంభాజీ మూవీ వలన ఎలాంటి లాభం లేదు. ’’ అని ఈ సందర్భంగా అన్నారు.
మరాఠా ప్రజలు ఐక్యంగా ఉండాలని, తమిళనాడు ప్రజలను చూసి నేర్చుకోవాలని ఈ సందర్భంగా థాక్రే అన్నారు. ‘‘రాష్ట్ర హక్కులు, ఆత్మ గౌరవం కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నారు. హిందీని రుద్దడంపై తిరగబడుతున్నారు. కానీ మన సమాజం గుజరాతీయులకు లొంగిపోయింది.’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘ఛావా సినిమా ద్వారా ఔరంగజేబు ఛత్రపతి షంభాజీ మహారాజ్ ను టార్చర్ చేసినట్లు చూపించారు. ఔరంగజేబు గుజరాత్ లో పుట్టడు. ఇప్పుడు ఆ గుజరాతీయులే అసత్య ప్రచారాలు చేసి లబ్ది పొందాలని చూస్తున్నారు. రెచ్చగొట్టే వారికి చరిత్రతో పనిలేదు’’ అని ఈ సందర్భంగా అన్నారు.
మతం మీ ఇంటి నాలుగు గోడల మధ్య ఉండాలి:
మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలిని అన్నారు థాక్రే. ‘‘మతం నాలుగు గోడల మధ్య ఉండాలి. ముస్లింలు రోడ్లపైకి వచ్చినప్పుడు లేదంటే అల్లర్లు జరిగిప్పుడే మిమ్మల్ని హిందువులుగా గుర్తిస్తారు. లేదంటే మిగతా సమయాల్లో హిందువులు కులాలుగా విభజించబడే ఉంటారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.’’ అని రాజ్ థాక్రే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.