ఆగి సాగిన పత్తి కొనుగోళ్లు

ఆగి సాగిన పత్తి కొనుగోళ్లు

బకాయిల కోసం కొనుగోళ్లను బంద్​ చేసిన వ్యాపారులు. . మంత్రి హామీతో మళ్లీ షురూ
సోమవారం ఉదయం మార్కెట్లలో నిలిచిన కాటన్​ విక్రయాలు

నిరసనగా పలుచోట్ల ఆందోళనకు దిగిన రైతులు
ఉద్రిక్త పరిస్థితులతో రంగంలోకి పోలీసులు

మంత్రి హామీతో మధ్యాహ్నం నుంచి కొనుగోళ్లు
సర్కారుకు నాలుగు రోజుల డెడ్‌‌లైన్ విధించిన జిన్నింగ్ అసోసియేషన్

వెలుగు, నెట్‌‌వర్క్:ప్రభుత్వ తీరుతో పత్తి రైతులు పరేషాన్ అయితున్రు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెయిన్‌‌ పత్తి మార్కెట్లకు రైతులు పెద్ద ఎత్తున పత్తి తెచ్చిన్రు. ఇగ కొనుగోళ్లు స్టార్ట్‌‌ అవుతాయనగా… జిన్నింగ్​ వ్యాపారులు ఉన్నట్టుండి పత్తి కొనేది లేదని ప్రకటించారు. తమకు రావాల్సిన బకాయిలను సర్కార్‌‌ చెల్లిస్తేనే కొంటమన్నరు. దీంతో అన్ని మార్కెట్లలో రైతులకు ఏమైంతుందో తెలవ్వని పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల రైతులు ఆందోళన చేపట్టి, కొనుగోళ్లపై అధికారులను నిలదీశారు. ఆయా మార్కెట్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు రంగంలోకి దిగారు. పై ఆఫీసర్లు సమస్యను మంత్రి నిరంజన్​రెడ్డికి తెలిపారు. నాలుగు రోజుల్లో బకాయిల విడుదల చేయిస్తానని మంత్రి మాటివ్వడంతో మధ్యాహ్నం నుంచి కొనుగోళ్లు స్టార్ట్‌‌ అయ్యాయి.

బకాయిలు ఇవ్వకపోవడంతోనే..

తెలంగాణలో అత్యధికంగా సాగయ్యే పంటల్లో పత్తి కూడా ఒకటి. వానకాలం సగటున సుమారు 30 లక్షల మంది రైతులు 44.47 లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ఏటా 2.80 కోట్ల క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తెస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ కాటన్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు జరుపుతున్న ప్రభుత్వం జిన్నింగ్, ప్రెస్సింగ్, బేల్ చేసేందుకు మిల్లులను అద్దెకు తీసుకుంటోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 350 జిన్నింగ్​ వ్యాపారులకు రూ.400 కోట్ల రియింబర్స్​మెంట్​ను ప్రభుత్వం బాకీపడింది. ఇందులో ​జీఎస్టీ రియింబర్స్​మెంట్​, టీఎస్​ ఐపాస్​ ఇన్సెంటివ్ కూడా ఉన్నాయి. వీటి కోసం సీజన్​ ప్రారంభంలోనే వ్యాపారులు పట్టుపట్టారు. ఉన్నతాధికారులు హామీఇవ్వడంతో కొనుగోళ్లు ప్రారంభించారు. రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం ఉదయం మరోసారి తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ధర్నాలునిరసనలు

సోమవారం ఉదయం అకస్మాత్తుగా కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో అన్ని ప్రధాన మార్కెట్లలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్​ జిల్లాలోని జమ్మికుంట మార్కెట్​కు సోమవారం రైతులు1,060 క్వింటాళ్లడ పత్తి తెచ్చారు. కొనుగోళ్లు జరగవని చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు.  వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో మార్కెటింగ్​ శాఖ అధికారులు వ్యాపారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులను మోహరించారు. రాష్ర్ట కాటన్​ అసోసియేషన్​ అధ్యక్షుడు రవీందర్​రెడ్డి  రాష్ర్ట మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి, మార్కెటింగ్​ ప్రిన్సిపల్​సెక్రటరీ పార్థసారథితో  ఫోన్​లో మాట్లాడారు. నాలుగురోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో కొనుగోళ్లు పారంభించారు. మహబూబ్​నగర్​జిల్లా అడ్డాకుల మార్కెట్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం ఉదయం కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు వ్యాపారులు ప్రకటించగానే  రైతులు ఎన్​హెచ్​44 పై రెండు గంటల సేపు ధర్నా చేశారు.

ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు రైతులతో మాట్లాడి విరమింపజేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు తూకంలో మోసాలకు పాల్పడుతున్నారనీ, తేమ సాకుతో మద్దతు ధర చెల్లించడం లేదని ఆరోపించారు.  ఖమ్మం పత్తి మార్కెట్లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. పత్తికొనుగోళ్లు నిలిపివేస్తున్నామని వ్యాపారులు ప్రకటించగానే వివిధ సంఘాల  ఆధ్వర్యంలో  పత్తి  యార్డులో  రైతులు ఆందోళనకు దిగారు. దీంతో మార్కెట్‍ కమిటీ  చైర్మన్‍ మద్దినేని వెంకటరమణ, మార్కెట్​ కమిటీ కార్యదర్శి ఆర్‍.  సంతోష్​కుమార్​ రంగంలోకి దిగి, వ్యాపారులతో చర్చలు జరిపారు. మధ్యాహ్నం నుంచి కొనుగోళ్లు యథావిధిగా ప్రారంభం కావడంతో అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.