జాబ్​ రాక కాపురం కూలిపోయింది

  • విద్వాన్, విశారద క్యాండిడేట్లకు టీచర్​ ఉద్యోగాలు ఆపిన్రు
  • 2017 టీఆర్టీ నోటిఫికేషన్​లో రెండు డిగ్రీల తొలగింపు
  • అంతకుముందు అన్ని పరీక్షల్లో అవకాశం  
  • హైకోర్టు ఆర్డర్స్​తో టీఆర్టీ రాసిన అభ్యర్థులు 
  • సెలక్షన్స్​కోసం నాలుగేండ్లుగా వెయిటింగ్

మంచిర్యాల, వెలుగు: 2017 టీఆర్టీ హిందీ టీచర్స్ రిక్రూట్​మెంట్​లో విద్వాన్, విశారద అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. హైకోర్టు ఆర్డర్స్​తో ఎగ్జామ్​రాసి మెరిట్ సాధించినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.  చేతికి అందివచ్చిన ఉద్యోగం చేజారిపోవడంతో నాలుగేండ్లుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, సెక్రెటరీల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. సర్కారు నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే చాలామంది ఏజ్​బార్​ అయ్యామని, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. 

జీఓ నెంబర్​ 25తో చిచ్చు
ఉమ్మడి రాష్ర్టంలో టీచర్స్​రిక్రూట్​మెంట్​లో హిందీ టీచర్స్ పోస్టులకు హిందీలో డిగ్రీ లేదా ఈక్వెలెంట్​(విద్వాన్​, విశారద), హిందీ పండిట్​ ట్రైనింగ్​ (హెచ్​పీటీ), టీచర్స్​ఎలిజిబిలిటీ టెస్ట్​ (టెట్​) అర్హతలుగా ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత 2017లో నిర్వహించిన గురుకుల టీచర్స్​ రిక్రూట్​మెంట్​లోనూ హిందీ టీచర్​ పోస్టులను పై అర్హతలతోనే భర్తీ చేశారు. ఈ అర్హతతోనే రెండుసార్లు టెట్ నిర్వహించారు. కానీ 2017 అక్టోబర్​ 10న అప్పటి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రంజీవ్ ఆచార్య జీఓ నెంబర్ 25ను తీసుకువచ్చారు. అదే నెల 21న టీఎస్​పీఎస్​సీ ద్వారా టీఆర్టీ నోటిఫికేషన్​ రిలీజ్​ చేశారు. 158 హిందీ స్కూల్​ అసిస్టెంట్​, 352 హిందీ లాంగ్వేజ్​ పండిట్ పోస్టుల ఖాళీలను ప్రకటించారు. నోటిఫికేషన్​లో ఎలిజిబిలిటీ హిందీలో డిగ్రీ లేదా సమాన విద్యార్హత ఉండాలని, దానికి యూజీసీ గుర్తింపు ఉండాలని పేర్కొన్నారు. దీంతో విద్వాన్, విశారద అర్హతతో హెచ్​పీటీ చేసి, టెట్​క్వాలిఫై అయినవారు టీఆర్టీకి అర్హత కోల్పోయారు. కనీసం 2014 వరకైనా కటాఫ్ డేట్ ఇవ్వకుండా జీఓ తీసుకొచ్చిన వారం రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చారని, అంతకు నాలుగు నెలల ముందే గురుకుల టీచర్స్​ రిక్రూట్​మెంట్​ టెస్ట్​ రాసిన తమకు అర్హత లేకుండా పోయిందని వాపోయారు. దీంతో హైకోర్టును ఆశ్రయించగా, 2018 ఫిబ్రవరి 2న నిర్వహించిన టీఆర్టీ రాయడానికి పర్మిషన్​ ఇచ్చింది. ఫలితాల్లో స్టేట్ టాప్ ర్యాంకర్స్ మొదలుకొని 80 శాతం మంది విద్వాన్, విశారద క్యాండిడేట్సే ఉన్నారు. హిందీలో డిగ్రీ, పీజీలు చేసినవారు 1,0-15 మంది మాత్రమే టీఆర్టీ రాయగా, మెరిట్​ లిస్టులో విద్వాన్​, విశారద క్యాండిడేట్స్ కన్నా వెనకే వచ్చారు. అయితే జీఓ 25 ప్రకారం విద్యార్హతల విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆర్డర్స్​ఇవ్వగా హిందీలో డిగ్రీ, పీజీ అర్హతలున్నవాళ్లను మాత్రమే సెలెక్ట్ చేసింది. దీంతో ఎంతోమందికి అన్యాయం జరిగింది. విద్వాన్​, విశారదలను డిగ్రీలుగా గుర్తించనప్పుడు ఆ డిగ్రీలతో పీజీలు చేస్తే ఎట్లా చెల్లుబాటవుతాయని, వాళ్లకు ఏ రకంగా ఉద్యోగాలు ఇస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న 50కి పైగా పోస్టులతో పాటు సూపర్​ న్యూమరరీ పోస్టులు క్రియేట్​చేసి తమకు ఇవ్వాలని కోరుతున్నారు. 

సీఎం పేషీలో ఫైళ్లు పెండింగ్ 
హిందీ టీచర్స్​ రిక్రూట్​మెంట్​లో జరిగిన పొరపాట్లను సవరించి న్యాయం చేయాలని కోరుతూ అభ్యర్థులు 2018 నుంచి పోరాడుతున్నారు. గవర్నర్​, విద్యాశాఖ మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , సంఘాల లీడర్లను కలిసి విన్నవించారు. అయినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. 2019 జనవరి 28న, 2020 నవంబర్​ 4న జనరల్​అడ్మినిస్ర్టేషన్ ​డిపార్ట్​మెంట్ ​నుంచి సీఎం పేషీకి వెళ్లిన రెండు ఫైళ్లు​ అక్కడే పెండింగ్​లో ఉన్నాయని చెప్తున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం సూపర్ న్యూమరరీ పోస్టులను క్రియేట్ చేసి ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.  

35వేల మందికి అన్యాయం
రాష్ర్టవ్యాప్తంగా విద్వాన్​, విశారద డిగ్రీలతో హెచ్​పీటీ చేసి, టెట్​క్వాలిఫై అయినవాళ్లు సుమారు 35వేల మంది ఉన్నారు. జీఓ  నంబర్​ 25 ప్రకారం భవిష్యత్​లోనూ హిందీ టీచర్స్​ పోస్టులకు వీరంతా అనర్హులే. ఈ డిగ్రీలతోనే ప్రభుత్వం గతంలో ఎల్​పీసెట్​ నిర్వహించగా, ఫీజు రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​లు అందించింది. తెలంగాణలో గురుకుల టీచర్స్​రిక్రూట్​మెంట్​తో పాటు రెండుసార్లు టెట్​ కూడా ఇదే అర్హతలతో​ నిర్వహించింది. ఏపీతో పాటు మిగతా రాష్ర్టాల్లో ఈ డిగ్రీలతోనే హిందీ టీచర్​ ఉద్యోగాలు ఇస్తున్నారు.  విద్వాన్, విశారద కోర్సులను డిగ్రీగా పరిగణించి గత ఎమ్మెల్సీ ఎలక్షన్స్​లో గ్రాడ్యుయేట్స్​ ఓటుహక్కును కూడా కల్పించారు.  వీటిని పరిగణలోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత అభ్యర్థులు కోరుతున్నారు.  

జాబ్​ రాక కాపురం కూలిపోయింది
నేను విద్వాన్​తో హెచ్​పీటీ చేశాను. టెట్​క్వాలిఫై అయ్యాను. జీఓ నంబర్ 25లో విద్వాన్​, విశారదలను తొలగించగా, హైకోర్టు ఆర్డర్స్​తో టీఆర్టీసీ రాశాను. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో ఎస్సీ రిజర్వేషన్​ కేటగిరీలో సెకండ్​ ర్యాంక్​ సాధించాను. అయినా నాకు జాబ్​ రాలేదు. మెరిట్​లో నాకంటే వెనుక ఉన్నవాళ్లకు ఇచ్చారు. ఇదెక్కడి న్యాయం? నాకు జాబ్​ రాకపోవడంతో కాపురం కూలిపోయింది. జాబ్​ వచ్చాకే వస్తా అంటూ భర్త వెళ్లిపోయాడు.  
– యశోద, మోపాల్​, నిజామాబాద్​

4వ ర్యాంక్​ వచ్చినా జాబ్​ రాలే

మ్మడి రాష్ర్టంలో, తెలంగాణ వచ్చిన తర్వాత గురుకుల టీచర్స్​ రిక్రూట్​మెంట్​లో హిందీ టీచర్స్​ పోస్టులకు విద్వాన్​, విశారద క్యాండిడేట్స్​ను సెలెక్ట్​ చేశారు. కానీ 2017 టీఆర్టీ నోటిఫికేషన్​లో వీటిని తొలగించారు. హైకోర్టు పర్మిషన్​తో టీఆర్టీ రాసి మెరిట్​ సాధించినప్పటికీ మాకు అన్యాయం జరిగింది. నేను స్టేట్​లో 31వ ర్యాంక్​, ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో 4వ ర్యాంక్​ సాధించినప్పటికీ ఉద్యోగం దక్కలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయం చేయాలి. 
– సలీంఖాన్​, మంచిర్యాల టౌన్