ఆసిఫాబాద్, వెలుగు: బోర్లు, కరెంట్ కనెక్షన్ల ద్వారా గిరిజన రైతుల బీడు భూములను సాగులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గిరి వికాసం పథకం ముందుకు సాగడం లేదు. ఆరు నెలలుగా ఫండ్స్ లేక స్కీమ్ నిలిచిపోయింది. దీంతో రబీలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెకండ్ క్రాప్ తమను నష్టాలపాలు చేస్తోందని వాపోతున్నారు. గిరి వికాసం పథకం ద్వారా ఆసిఫాబాద్జిల్లాలో లక్ష ఎకరాల్లో సెకండ్ క్రాప్ సాగు చేయాలన్న టార్గెట్ తో అధికారులు ప్లాన్‌రెడీ చేశారు. పథకానికి రూ. 8.54 కోట్లు కేటాయించగా 2,281 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది కాలంలో కేవలం 62 బోర్లు మాత్రమే వేశారు. కానీ ఒక్క మోటారు కూడా పంపిణీ చేయలేదు. పనులు కాకపోవడంతో గత ఏడాది 40 వేల ఎకరాల్లో మాత్రమే సెకండ్ క్రాప్ సాగు సాధ్యమైంది. ఏజెన్సీ ప్రాంతాలైన కెరమెరి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్ యూ మండలాల్లో కనీసం రైతులను ఎంపిక చేయలేదు. సర్వే కూడా నిర్వహించలేదు. దీంతో దరఖాస్తు చేసిన గిరిజన రైతులు నిరాశకు గురవుతున్నారు.
రూ. 2.2 కోట్లు ఇయ్యలే..
గిరి వికాసం పథకం కింద ఎంపిక చేసిన రైతుల చేన్లలో బోరు వేసి, కరెంట్ సప్లై చేసి, మోటార్ బిగించి సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి. స్కీమ్‌లో భాగంగా ఆఫీసర్లు 62 బోర్లు వేశారు. 21 చోట్ల కరెంటు పనులు చేపట్టారు. కానీ సర్కారు ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో స్కీమ్ ఆగిపోయింది. చేసిన పనులకు రూ. 2.2 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఆరు నెలలుగా ఎదురుచూపులు తప్పడం లేదు. గత్యంతరం లేక రైతులు వాగులు, వంకల్లో ఆయిల్ ఇంజన్లు ఏర్పాటు చేసి రబీ పంటకు నీరందిస్తున్నారు. డీజిల్ ధర పెరగడంతో పెట్టుబడి పెరిగింది. పంట చేతికి అందేవరకు ఎకరానికి రూ. 10 వేల నుంచి 15 వేలు డీజిల్ కే ఖర్చవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో రబీలో ఎక్కువగా గోధుమలు, శనగలు, మొక్కజొన్న, జొన్న, కూరగాయలు సాగు చేస్తుంటారు. పండించిన పంటలకు మద్దతు ధర లేకపోవడంతో పెట్టుబడికి తగిన ఆదాయం పొందలేకపోతున్నారు. మరోవైపు దిగుబడి తగ్గడంతో అప్పులపాలవుతున్నారు.
ప్రాజెక్టులు, చెరువులున్నా..
జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువుల్లో నీరున్నా కాలువలు పూర్తి కాకపోవడంతో చేన్లకు నీరందడం లేదు. కాలువల్లో మట్టి పూడుకుపోయింది. చేను పక్కనే పొలాలు ఉన్న రైతులు ఆయిల్ ఇంజన్ల ద్వారా వాగులో నీటిని వాడుకుంటున్నారు. ఉన్న నీటిని రైతులంతా ఆయిల్ ఇంజన్లతో తోడేయడంతో రెండు నెలల్లోనే వాగులు ఎండిపోతున్నాయి. దీంతో నీళ్లు లేక రబీ పంటలు ఎండిపోవడమే కాకుండా దిగుబడి తగ్గిపోతోంది. గిరి వికాసం పథకం పనులు పూర్తి చేస్తేగానీ వ్యవసాయం మెరుగుపడదని రైతులు పేర్కొంటున్నారు.
నివేదిక పంపినం
గిరి వికాసం స్కీమ్ కు సంబంధించిన ఫండ్స్ జూన్ నుంచి రావడం లేదు. ఫండ్స్ లేకపోవడంతో పనులు చేయలేకపోతున్నం. రూ. 2.29 కోట్లు రిలీజ్కావాల్సి ఉంది. సర్కారుకు నివేదిక పంపినం. ఫండ్స్ రాగానే పనులు పూర్తి చేస్తాం. సిర్పూర్ నియోజకవర్గస్థాయిలో రైతుల సర్వే కంప్లీట్ అయింది. ఆసిఫాబాద్ నియోజకవర్గస్థాయిలో కెరమెరి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్ యూ మండలాల్లోని రైతులు సర్వే జనవరిలో చేస్తాం. - ఆంజనేయులు, గిరి వికాసం ఏపీడీ
అప్లై చేసినా పత్తా లేదు
రబీ సాగు చేయాలంటే భయమేస్తోంది. కనీసం పెట్టుబడి కూడా చేతికి రావడం లేదు. ఏడాది క్రితం గిరివికాసం స్కీమ్ లో అప్లై చేస్తే ఇప్పటికీ పత్తా లేదు. కష్టం మీద ఆయిల్ ఇంజిన్ పెట్టి వాగులో నీటిని మళ్లించి సాగు చేస్తున్న. డీజిల్ ధర పెరిగింది. ఎకరానికి రూ. పది నుంచి పదిహేను వేలు డీజిల్ కే పోతున్నయ్. పండిన పంట అమ్మినా పెట్టుబడి రాదు. పండించి తినడం కంటే కొనుక్కొని తినడం నయమనిపిస్తోంది.
- ఆడ లింబరావు, రాఘపూర్, జైనూర్
ఇంకా సర్వే చేయలే
మా ఊర్లో 9 మందికి మంజురైనట్లు చెప్పిండ్రు. నేను అప్లై చేసి సంవత్సరం అయింది. ఇంకా సర్వే చేయలేదు. కరెంటు మోటర్ పెట్టి చేను చుట్టూ కంచె ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంకా పనులు స్టార్ట్ కాలేదు.
- జూగ్నక దేవురావు, మార్లవాయి, జైనూర్