ఎడపల్లి, వెలుగు : ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఎడపల్లి మండల సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. అధికార బీఆర్ఎస్ ఎంపీటీసీలకు, ఎడపల్లి గ్రామ ఉప సర్పంచ్ కు మధ్య మాటలు పెరగడంతో ఎంపీపీ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. ఎడపల్లి గ్రామ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ సమావేశానికి వచ్చి ఎడపల్లిలో రూర్బన్ పథకం కింద నిర్మించిన భవనాలను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు.
కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన బిల్డింగ్ల ప్రారంభానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు చేపట్టాలని కోరారు. ఎంపీపీ శ్రీనివాస్, కూర్ణపల్లి ఎంపీటీసీ రాంరెడ్డి తదితరులు ఎడపల్లి ఉప సర్పంచ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల సమావేశంలోకి ఉప సర్పంచ్ వచ్చి మాట్లాడే హక్కు లేదని అన్నారు. దీంతో మిగతా అంశాలపై చర్చ జరగకుండానే సమావేశం ముగిసింది