హెచ్‌‌ఐవీ ఉందని ప్రమోషన్ ఆపడం వివక్షే.. ఢిల్లీ హైకోర్టు సంచలన కామెంట్స్

హెచ్‌‌ఐవీ ఉందని ప్రమోషన్ ఆపడం వివక్షే.. ఢిల్లీ హైకోర్టు సంచలన కామెంట్స్

న్యూఢిల్లీ: హెచ్‌‌ఐవీతో బాధపడుతున్న పారామిలటరీ ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వకపోవడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. ప్రొబెషనరీ పూర్తయిన కానిస్టేబుల్‌‌కు పర్మినెంట్‌‌ అపాయింట్‌‌మెంట్‌‌ ఇచ్చేందుకు నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్‌‌ఐవీతో ఉన్న ఉద్యోగులకు వసతి కూడా కల్పించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని పేర్కొంది. 

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌‌ఎఫ్‌‌)లో ప్రొబేషన్‌‌లో ఉన్న కానిస్టేబుల్‌‌కు 2023లో పర్మనెంట్‌‌ అపాయింట్‌‌మెంట్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. అలాగే, మరో ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌‌(సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌)లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు.. తమకు హెచ్‌‌ఐవీ ఉందన్న కారణంగా అధికారులు ప్రమోషన్‌‌ ఇవ్వలేదని కోర్టుకెక్కారు. ఈ ముగ్గురికి సంబంధించిన పిటిషన్‌‌లపై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారించింది. 

ఎయిడ్స్ ఉన్న కారణంగా ప్రమోషన్, అపాయింట్‌‌మెంట్ తిరస్కరించలేమని పేర్కొంది. అలా నిరాకరించడం హెచ్‌‌ఐవీ ప్రివెన్షన్‌‌ అండ్ కంట్రోల్ యాక్ట్ కింద వివక్షే అవుతుందని స్పష్టం చేసింది. సమస్యపై మరోసారి సమీక్షించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత డిపార్ట్‌‌మెంట్లను ఆదేశించింది.